రామన్నపై తిరగబడిన ట్వీట్

దామగుండంలో కేంద్రం నెలకొల్పుతున్న నౌకాదళ రాడార్ కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి కేటీఆర్ సంధించిన ట్వీట్‌పై నెటిజన్లు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు

రామన్నపై తిరగబడిన ట్వీట్
  • దామగుండం రాడార్ ట్విట్‌పై నెటిజన్ల కౌంటర్


విధాత, హైదరాబాద్ : దామగుండంలో కేంద్రం నెలకొల్పుతున్న నౌకాదళ రాడార్ కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి కేటీఆర్ సంధించిన ట్వీట్‌పై నెటిజన్లు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. దామగుండం నౌకదళ రాడార్ ఏర్పాటు కోసం 3000 ఎకరాల అటవీ ప్రాంతంలో విస్తరించి ఉన్న 12 లక్షల చెట్లను నరికివేయడంతో మూసీ నది పుట్టే ప్రాంతంలోని జీవ వైవిధ్యాన్ని నాశనం చేయడం తప్పుడు చర్యగా కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కోన్నారు.


అందుకే బీఆరెస్ ప్రభుత్వం 10ఏళ్లకు పైగా రాడార్ ఏర్పాటు ప్రతిపాదనను ప్రతిఘటించిందన్నారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం పర్యావరణ పరిణామాల గురించి అలోచించకుండా 10 రోజుల్లేనే కేంద్రానికి లొంగిపోయిందని, తెలంగాణ భవిష్యత్ తరాలను ప్రభావితం చేసే తమ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని కేటీఆర్ ట్వీట్‌లో డిమాండ్ చేశారు.


అయితే రాడర్ కేంద్రం ఏర్పాటుపై కేటీఆర్ లెవనెత్తిని అభ్యంతరాలను నెటిజన్లు ప్రశ్నిస్తూ బీఆరెస్‌ ప్రభుత్వం గతంలో అవే అంశాలపై సాగించిన ఉల్లంఘనలను కోడ్ చేస్తూ ఎదురుదాడి చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రోడ్డు నిర్మాణ సమయంలో 7,800 ఎకరాల్లో అడవిలోని 22నుంచి 25 లక్షల చెట్లను నరికివేసినప్పుడు మీరేందుకు మౌనంగా ఉన్నారని ఓ నెటిజన్ కేటీఆర్‌ను ప్రశ్నించాడు.


‘హరిత హారం పేరు మీద మన సాంప్రదాయ మొక్కలను తీసేసి రోడ్డుకి ఇరువైపులా వేరే దేశం వాళ్లు నిషేదించిన విషపూరిత మొక్కలను నాటారని, అలాంటి మీరు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని, సిటీ మొత్తం విషపు మొక్కలు నాటి సొల్లు కబుర్లు చెప్తున్నాడని మరో నెటిజన్ అగ్రహం వ్యక్తం చేశాడు. ‘తెలంగాణలో లిక్కర్ నదిని పారించి జనాల్ని మందుబాబుల్ని చేసి లిక్కర్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ట్విటర్‌ టీల్లు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారా భయ్యా.. అంటూ మరొకరు ఇలా పలువురు నెటిజన్లు రకరకాల విమర్శలతో వరుస ట్వీట్లతో కేటీఆర్‌పై కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.