Congress | మహిళ రిజర్వేషన్ బిల్లు కావాలన్నావు.. ఇప్పుడు 7 టికెట్లే ఇస్తారా: ఎమ్మెల్సీ కవితపై మహిళా కాంగ్రెస్ ధ్వజం

Congress | ఏడుగురికే టికెట్లు ఇచ్చిన ఎందుకూ ప్రశ్నించవు విధాత: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఢిల్లీలో ధర్నా చేసిన బీఆరెస్ ఎమ్మెల్యే కవిత సొంత పార్టీ అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో ఏడుగురు మహిళకే అవకాశమిస్తే మీ అయ్యను ఎందుకు ప్రశ్నించలేదంటు తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు నిలదీశారు. మంగళవారం గాంధీభవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షురాలు పాల్వాయి స్రవంతి, అధికార ప్రతినిధి కాల్వ సుజాత, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావులు మీడియాతో మాట్లాడుతూ కవిత వైఖరిపై ధ్వజమెత్తారు. మహిళ రిజర్వేషన్లపై […]

  • Publish Date - August 22, 2023 / 01:21 PM IST

Congress |

  • ఏడుగురికే టికెట్లు ఇచ్చిన ఎందుకూ ప్రశ్నించవు

విధాత: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఢిల్లీలో ధర్నా చేసిన బీఆరెస్ ఎమ్మెల్యే కవిత సొంత పార్టీ అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో ఏడుగురు మహిళకే అవకాశమిస్తే మీ అయ్యను ఎందుకు ప్రశ్నించలేదంటు తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు నిలదీశారు. మంగళవారం గాంధీభవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షురాలు పాల్వాయి స్రవంతి, అధికార ప్రతినిధి కాల్వ సుజాత, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావులు మీడియాతో మాట్లాడుతూ కవిత వైఖరిపై ధ్వజమెత్తారు.

మహిళ రిజర్వేషన్లపై నిజంగా కవితకు చిత్తశుద్ధి ఉంటే బీఆరెస్‌లో ఏడుగురికి మాత్రమే టికెట్లు ఇవ్వడంపై పోరాటం చేద్దాం రా అంటూ డిమాండ్ చేశారు. మహిళల పట్ల మీ అయ్యాచూపిన వివక్షపై పోరాటానికి నువ్వు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పైన నిందలు వేసే ముందు మీ నాయిన కేసీఆర్ కూడా కాంగ్రెస్ తోనే రాజకీయాల్లోకి వచ్చారన్న సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో జంతర్ మంతర్ దగ్గర బూటకపు పోరాటాలు చేయడం కాదని, దమ్ముంటే ప్రగతి భవన్ వద్ద ధర్నా చేద్దాంరా అంటూ పిలుపిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించిందని, మహిళలకు ఏఐసీసీ అధ్యక్ష పదవి, ప్రధాన మంత్రి పదవి, లోక్ సభ లో స్పీకర్ పదవీ, రాష్ట్రపతి పదవి ఇచ్చిందన్నారు. మహిళ రిజర్వేషన్లను రాజ్యసభలో ఆమోదించిన చరిత్ర, ఘనత కాంగ్రెసదేనన్నారు. లిక్కర్ కుంభకోణం బయటకు రాకుండా ఉండేందుకే జంతరమంతర్ వద్ధ మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత బూటకపు ధర్నా చేసిందన్నారు.

ఎంపీగా ఉన్న సమయంలో ఏనాడైనా మహిళా రిజర్వేషన్లు గురించి నీవు గాని, మీ బీఆరెస్ పార్టీ గాని ఎందుకు మాట్లాడలేదంటు ప్రశ్నించారు. ఇన్నాళ్లు మోడీతో అంటకాగిన మీరు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తారా అని మండిపడ్డారు. హైదరాబాద్ లో బాలికల మీద, మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే, అడ్డగోలుగా తాగిన తాగుబోతులు అరాచకాలు చేస్తుంటే కవిత ఏం చేస్తుందంటూ వారు ప్రశ్నించారు. సమావేశంలో మాహిళా కాంగ్రెస్ నాయకురాలు రాధిక ప్రభృతులు పాల్గొన్నారు.