22న వామపక్షాల సదస్సు.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, మతోన్మాద, కార్పోరేట్ విధానాలను, సీఏఏను నిరసిస్తూ ఈ నెల 22న వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును నిర్వహించనున్నట్లుగా వామపక్ష పార్టీలు ప్రకటించాయి

- ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం
- వామపక్ష పార్టీల నిర్ణయం
విధాత, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, మతోన్మాద, కార్పోరేట్ విధానాలను, సీఏఏను నిరసిస్తూ ఈ నెల 22న సాయంత్రం 5.30గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం కళానిలయంలో వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును నిర్వహించనున్నట్లుగా వామపక్ష పార్టీలు ప్రకటించాయి. ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృత చర్చలు జరిపి భవిష్యత్తు ప్రజాపక్ష పోరాటాల ఉద్యమ కార్యాచరణను నిర్ధేశించుకోనున్నట్లుగా వెల్లడించాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సమస్యలను పక్కదోవ పట్టించడానికి మతోన్మాద విధానాలను ముందుకు తెస్తున్నదని వామపక్షాలు ఆక్షేపించాయి. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, దాడులకు పాల్పడుతున్నదని, ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లోని గవర్నర్ వ్యవస్థను తమ స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకుంటూ ఆయా ప్రభుత్వాలను పడగొడుతున్నదని ఆరోపించాయి. ఈడీ, ఐటీ దాడులు చేయించి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నదని, ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల్లో చూపుతూ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ దేశ సంపదను వారికి దోచి పెడుతున్నదని విమర్శించాయి.
కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్‌లు తెచ్చిందని, నల్ల చట్టాలను తెచ్చి రైతుల నడ్డి విరుస్తున్నదని, బీజేపీ మతోన్మాద, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరాయి. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య, డీజీ నరసింహారావు, సీపీఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నేతలు రమ, హనుమేష్, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేతలు గోవర్దన్, ఎం. శ్రీనివాస్, ఎంసీపీఐ నేతలు జి. రవి, ఎస్‌యుసీఐ(యు) నేత మురహరి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత వేములపల్లి వెంకట్రామయ్య పాల్గొన్నారు.