గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో ఘోరం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుత మృతి చెందింది

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో ఘోరం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుత మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెటర్నరీ దవాఖానకు తరలించారు. అయితే ఆదివారం రాత్రి చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సోమవారం తెల్లవారుజామున రైతులు తమ పొలాలకు వెళ్తుండగా, రోడ్డుపై పడి ఉన్న చిరుత కళేబరాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చనిపోయిన చిరుతను చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు.
ఫిలిబిత్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలోని రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ రాయల్ బెంగాల్ టైగర్స్, చిరుతలు, మచ్చల జింకలు, మొసళ్లకు నిలయంగా ఉంది. కొద్ది రోజుల క్రితం ఈ టైగర్ రిజర్వ్ నుంచి అత్‌కోనా గ్రామంలోకి ప్రవేశించిన ఓ పులి.. ఇంటి ప్రహరీ గోడపై ఆరు గంటల పాటు నిద్రించిన సంగతి తెలిసిందే. అనంతరం దానికి మత్తు ఇచ్చి అటవీశాఖ అధికారులు అక్కడ్నుంచి తరలించారు. గోడపై ఉన్న పులిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.