చిక్కుల్లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌..!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చిక్కుల్లోపడ్డారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో విచారణకు పిలిచినా హాజరుకావడం లేదంటూ ED రౌస్‌ అవెన్యూ కోర్టుకు వెళ్లింది

చిక్కుల్లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌..!

Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చిక్కుల్లోపడ్డారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో విచారణకు పిలిచినా హాజరుకావడం లేదంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) రౌస్‌ అవెన్యూ కోర్టుకు వెళ్లింది. మనీలాండరింగ్‌ నిరోధకచట్టంలోని సెక్షన్‌ 50కి లోబడి సమన్లు పంపగా.. విచారణకు సహకరించడం లేదంటూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు రౌస్‌ అవెన్యూ కోర్టులోని అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ దివ్య మల్హోత్రా ఎదుట హాజరై వాదనలు వినిపించారు. వేర్వేరు తేదీల్లో ఐదుసార్లు సమన్లు జారీ చేసి విచారణకు సహకరించాలని కోరిందని.. అయితే ఆయన ప్రతిసారీ ఉద్దేశపూర్వకంగా సహకరించడం లేదని కోర్టు పేర్కొన్నారు. ఈ మేరకు చట్టం ప్రకారం కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఇప్పటి వరకు ఐదుసార్లు ఈడీ సమన్లు జారీ చేసినా ఆయన గైర్హాజరయ్యారు. ఈ కేసు వ్యవహారంలో ఇప్పటికే మనీష్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈడీ జారీ చేసిన సమన్లు రాజకీయ ప్రేరేపితమని ఆప్‌ ఆరోపంచింది. ఢిల్లీ సీఎంను అరెస్టు చేసేందుకు ఈడీ యోచిస్తోందని మండిపడింది. 2021-22కి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఆగస్టు 17, 2022న నమోదు చేసిన కేసులో మనీలాండరింగ్‌పై ఈడీ విచారణ జరుపుతున్నది.

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఫిర్యాదు మేరకు 2022 జూలై 20న సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ ఆగస్టు 22న మనీలాండరింగ్‌ కోణంలో కేసు నమోదు చేసింది. ఈడీ సమన్లపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పునావాలా మాట్లాడుతూ ఇప్పటి వరకు ఢిల్లీ, భారతదేశ ప్రజలకు కేజ్రీవాల్‌ అవినీతి తెలుసునన్నారు. ఆయన మెడిసిన్‌ నుంచి లిక్కర్‌ వరకు అన్నింట్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఏవేవో కుంటి సాకులు చెబుతూ విచారణ నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ చివరిసారిగా శుక్రవారం విచారణకు రావాలంటూ సమన్లు పంపింది. ఈ సమన్లను చట్టపరంగా ఎదుర్కొంటామని ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయడమే ఈడీ లక్ష్యంగా పెట్టుకుందని, ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లుగా ఆరోపించింది.