Prime Energy | అమెరికాలో అలజడి రేపుతున్న సాఫ్ట్‌డ్రింక్
Prime Energy విధాత: అమెరికా (America) లో విడుదలైన ఓ సాఫ్ట్‌డ్రింక్ ఆ దేశంలో స్థానికంగా కలకలం రేపుతోంది. కెఫీన్ (Caffeine) స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ఆ డ్రింక్‌ను నిషేధించాలని ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. అమెరికాకు చెందిన ప్రముఖ యూట్యూబ్ స్టార్లు లోగన్ పాల్, బ్రిటొన్ సైలకు పిల్లలు, టీనేజర్లలో మంచి క్రేజ్ ఉంది. వీరు చేసే వీడియోలు అప్పుడప్పుడు కాంట్రవర్సీలకు కూడా కారణమవుతుంటాయి. వీరిద్దరూ కలిసి […]

Prime Energy
విధాత: అమెరికా (America) లో విడుదలైన ఓ సాఫ్ట్‌డ్రింక్ ఆ దేశంలో స్థానికంగా కలకలం రేపుతోంది. కెఫీన్ (Caffeine) స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ఆ డ్రింక్‌ను నిషేధించాలని ప్రకటనలు ఇవ్వడం గమనార్హం.
అమెరికాకు చెందిన ప్రముఖ యూట్యూబ్ స్టార్లు లోగన్ పాల్, బ్రిటొన్ సైలకు పిల్లలు, టీనేజర్లలో మంచి క్రేజ్ ఉంది. వీరు చేసే వీడియోలు అప్పుడప్పుడు కాంట్రవర్సీలకు కూడా కారణమవుతుంటాయి. వీరిద్దరూ కలిసి 2022లో ప్రైమ్ హైడ్రేషన్ అనే డ్రింక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఇందులో కెఫీన్‌ను కలపకపోవడంతో సమస్యలేమీ రాలేదు.
ఆ తర్వాత 2023లో ప్రైమ్ ఎనర్జీ (Prime Energy) అనే డ్రింక్‌ను రూపొందించి విడుదల చేశారు. ఇందులో సుమారు 200 మి. గ్రా. కెఫీన్ ఉందని డ్రింక్ క్యాన్‌పై పేర్కొన్నారు. ఇది కోకాకోలాలో ఉండే దానికంటే 30 మి.గ్రా. అధికంకాగా.. రెడ్‌బుల్ క్యాన్‌లో ఉండే దానికంటే 80 మి.గ్రా. అధికం.
ప్రైమ్ ఎనర్జీని లాంచ్ చేయడానికి రూపొందించిన ప్రకటన వీడియోపైనా ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు.. నీరసంగా నిరాసక్తంగా ఆడుతూ ఉంటారు. వీరు ప్రైమ్ ఎనర్జీని తాగగనే అమిత ఉత్సాహం, బలంతో గేంలో విజృంభిస్తారు.
అనంతరం పలువురు టిక్‌టాక్ ఇన్‌ఫ్లూయెన్సర్‌లు ఈ డ్రింక్‌ను బాగా ప్రచారం చేశారు. మేము ప్రైమ్ కుర్రాళ్లం అనే ట్యాగ్‌లైన్‌ను పిల్లల్లోకి బాగా తీసుకెళ్లాయి. అయితే 12 ఏళ్ల లోపు పిల్లలు కెఫీన్‌లు ఏ మాత్రమూ తీసుకోకూడదని అమెరికన్ అకాడమీ ఫర్ చైల్డ్, అడాలసెంట్ సైకియాట్రీ నిబంధనలు చెబుతున్నాయి.
12 నుంచి 18 ఏళ్ల వయసు వారైతే రోజుకి 100 మి.గ్రా. కెఫీన్‌ను మాత్రమే తీసుకోవచ్చని వాటిల్లో ఉంది. అయితే ఒక ప్రైమ్ ఎనర్జీ క్యాన్‌లో దీనికి రెట్టింపు కెఫీన్ ఉంది. దీంతో ఈ డ్రింక్‌ను తరచుగా తీసుకునే పిల్లల్లో అలసట, కంగారు, తలపోటు, వాంతులు, రక్తపోటు, గుండె లయ తప్పడం వంటివి వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ డ్రింక్‌ను 18 ఏళ్ల లోపు వారిని లక్ష్యంగా చేసుకుని మార్కెటింగ్ చేస్తున్నారని… అదే తనకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని డెమోక్రాటిక్ సెనేటర్ చుక్ షూమర్ తెలిపారు. ఆరెంజ్, మ్యాంగో, రాస్‌బెర్రీ ఫ్లేవర్లతో వస్తున్న ఈ డ్రింక్.. పిల్లలను బాగా ఆకర్షిస్తోందని…దీనిని నిలువరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
షూమర్ వీటన్నింటినీ ప్రస్తావిస్తూ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు లేఖ రాయగా దీనిపై దర్యాప్తు చేస్తామని బదులు వచ్చినట్లు వెల్లడించారు. ఆ డ్రింక్ 18 ఏళ్ల లోపు వారికి కాదని క్యాన్‌పైనే రాసున్నా.. అది ఎక్కడా అమలు కావడం లేదని షూమర్ తెలిపారు.
వ్యాపార వర్గాల కుట్ర
కెఫీన్ ఆరోపణలపై ప్రైమ్ ఎనర్జీ వ్యవస్థాపకుడు పాల్ పాక్షికంగా స్పందించాడు. చట్టాలకు అనుగుణంగానే తమ డ్రింక్ ఉందని స్పష్టం చేశాడు. తమ ఎదుగుదల ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న కార్పొరేట్ పెద్దలకు కంటగింపుగా మారిందని… అందుకే ఇలాంటి వార్తలు వస్తున్నాయని అభిప్రాయపడ్డాడు.