Mukhtar Ansari | 36 ఏళ్ల నాటి కేసులో మాఫియాడాన్ ముక్తార్ అన్సారీకి జీవితఖైదు..

Mukhtar Ansari : ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాఫియా డాన్ ముక్తార్ అన్సారీకి వారణాసిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జీవితఖైదు విధించారు. అన్సారీని మంగళవారం 36 ఏళ్ల నాటి కేసులో దోషిగా తేల్చిన న్యాయస్థానం ఇవాళ శిక్ష ఖరారు చేసింది. నిబంధనలు ఉల్లంఘించి డబుల్ బారెల్ తుపాకీ లైసెన్సు పొందిన కేసులో ఆయనకు ఈ శిక్ష పడింది.
మాఫియా డాన్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముక్తార్ అన్సారీపై మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం లాంటి అనేక అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం బాందా జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్సారీకి గత ఏడాది సెప్టెంబర్ 22 నుంచి ఇప్పటివరకు ఇది ఎనిమిదో శిక్ష కావడం గమనార్హం.
మాఫియా డాన్‌గా పేరుగాంచిన ముక్తార్ 1990ల్లో రాజకీయాల్లో అడుగుపెట్టాడు. అప్పటికే ఆయన పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 1991లో కాంగ్రెస్ నేతను హత్య చేసిన కేసులోనూ ప్రధాన నిందితుడు. ఆ కేసులో 2023లో యావజ్జీవ శిక్ష పడింది. 1996 నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అన్సారీ.. మూడుసార్లు జైల్లో ఉండగానే విజయం సాధించాడు. ఇంకో హత్య కేసులో అన్సారీ ప్రస్తుతం 10 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, అన్సారీ దాదాపు 60కి పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.