విధాత, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో బీఆరెస్ పార్టీ వేగం పెంచింది. సోమవారం నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తాజాగా మరో అభ్యర్థిని ఖరారు చేశారు. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా సిటింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పేరును కేసీఆర్ ఫైనల్ చేశారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో భేటీయైన కేసీఆర్ మన్నె అభ్యర్థిత్వాన్ని ఆమోదించారు.
2019 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి బీఆరెస్ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇకపోతే ఇదే జిల్లాలోని నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదని కేసీఆర్ తెలిపారు. ముఖ్యులతో చర్చించి అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, ఖమ్మం అభ్యర్థిగా నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోత్ కవిత పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే.