Tomato
విధాత: గత కొద్ది రోజులుగా టమాటా (Tomato) ధరలు ఆకాశన్నంటుతున్న విషయం తెలిసిందే. దీని వల్ల మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ.. కొంతమంది ఇళ్లల్లో ఆ ధరలు బంగారు రాశులను కురిపిస్తున్నాయి. కేవలం టమాటాలు అమ్మడం ద్వారానే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు. పుణె (Pune) జిల్లాకు చెందిన తుకారం భాగోజీ అనే ఆ రైతు గత నెలలో మొత్తం 13 వేల టొమాటో క్రేట్ల (బాక్సులు)ను అమ్మాడు. ఈ విక్రయాల ద్వారా అతడికి అక్షరాలా రూ.1.5 కోట్ల మొత్తం లభించింది.
తుకారామ్‌కు మొత్తం 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. 12 ఎకరాల్లో టమాటా తోట వేశాడు. అతడి కుమారుడు, కోడలితో కలిసి కంటికి రెప్పలా చూసుకుంటూ పంటను సాగు చేశాడు. కోడలు సోనాలి పంట నాటడం, సాగు, ప్యాకేజింగ్‌లను చూసుకోగా.. అమ్మకాలు, నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక మొదలైన బాధ్యతలను కుమారుడు ఈశ్వర్ తీసుకున్నారు. ఫెర్టిలైజర్లు, ఫెస్టిసైడ్‌ల వాడకంపై అనుభవం ఉండటంతో మేలిమి రకం టమాటాలు పండేలా చూసుకున్నామని తుకారం కుటుంబం వెల్లడించింది.
గత శుక్రవారం ఒక్కరోజే 800 క్రేట్ల టమాటాలను అమ్మగా సుమారు రూ.18 లక్షలు వచ్చాయని తుకారం తెలిపారు. పుణె చుట్టుపక్కల ప్రాంతాల్లో గత నెల నుంచి ఒక్కో క్రేట్ టమాటాల ధర సుమారు రూ.1000 నుంచి రూ.2400 పలుకుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఈ ప్రాంతం రైతులు చాలా మంది తుకారంలాగే లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు. ఇదే వారం కర్ణాటకకు చెందిన ఓ రైతు (Farmer) 2000 బాక్సుల టమాటాలు అమ్మి రూ.38 లక్షలను ఇంటికి తెచ్చుకున్నాడు.