ఫోన్‌లో అశ్లీల చిత్రాలు.. కుమారుడికి విష‌మిచ్చి చంపిన తండ్రి

చ‌దువును నిర్ల‌క్ష్యం చేసి, ఫోన్లో అశ్లీల చిత్రాల‌ను చూస్తున్న కుమారుడికి తండ్రి విష‌మిచ్చి చంపాడు.ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని సోలాపూర్‌లో ఆల‌స్యంగా వెలుగు చూసింది

ఫోన్‌లో అశ్లీల చిత్రాలు.. కుమారుడికి విష‌మిచ్చి చంపిన తండ్రి

Maharashtra | ముంబై: చ‌దువును నిర్ల‌క్ష్యం చేసి, ఫోన్లో అశ్లీల చిత్రాల‌ను చూస్తున్న కుమారుడికి తండ్రి విష‌మిచ్చి చంపాడు.ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని సోలాపూర్‌లో జ‌న‌వ‌రి 13న చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.


వివ‌రాల్లోకి వెళ్తే.. సోలాపూర్ ప‌ట్ట‌ణానికి చెందిన విజ‌య్ భ‌ట్టు వృత్తిరీత్యా టైల‌ర్. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. కుమారుడు విశాల్(14) స్థానిక పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్నాడు. అయితే ప్ర‌తి రోజు స్కూల్‌కు మొబైల్ తీసుకెళ్లేవాడు విశాల్. త‌ర‌గ‌తి గ‌దిలో అశ్లీల చిత్రాలు చూస్తూ, తోటి విద్యార్థుల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించేవాడు.


ఈ విష‌యాన్ని విశాల్ తండ్రి దృష్టికి ఉపాధ్యాయులు తీసుకెళ్లారు. కుమారుడిపై త‌రుచుగా టీచ‌ర్లు ఫిర్యాదు చేయ‌డంతో తండ్రి విజ‌య్‌కు కోపం వ‌చ్చింది. ఇంట్లో కూడా నిత్యం ఫోన్‌లో మునిగి తేలుతూ అశ్లీల‌త‌కు అడిక్ట్ అయ్యాడు. దీంతో త‌న కుమారుడిని హ‌త్య చేయాల‌ని ప్లాన్ చేశాడు.


ఈ క్ర‌మంలో కూల్ డ్రింక్ తాగుదామ‌ని చెప్పి, కుమారుడిని జ‌న‌వ‌రి 13న బ‌య‌ట‌కు తీసుకెళ్లాడు తండ్రి. కూల్ డ్రింక్‌లో సోడియం నైట్రేట్ అనే ర‌సాయ‌నాన్ని క‌లిపి కుమారుడికి ఇచ్చాడు. ఆ డ్రింక్ తాగిన కాసేప‌టికే విశాల్ అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లాడు. విశాల్ చ‌నిపోయాడ‌ని నిర్ధారించుకున్న తండ్రి.. త‌న ఇంటికి స‌మీపంలోని డ్రైనేజీ కాల‌వ‌లో ప‌డేసి వెళ్లిపోయాడు.


ఇక ఎవ‌రికీ అనుమానం రావొద్ద‌నే ఉద్దేశంతో అదే రోజు రాత్రి త‌న కుమారుడు అదృశ్య‌మ‌య్యాడ‌ని భార్య‌తో క‌లిసి విజ‌య్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసుల‌కు విజ‌య్ ఇంటికి స‌మీపంలోని మురికికాల్వ‌లో విశాల్ మృత‌దేహం క‌నిపించింది.


దీంతో విజ‌య్‌ను విచారించ‌గా పొంత‌న లేని స‌మాధానాలు చెప్పాడు. చివ‌ర‌కు జ‌రిగిన విష‌యాన్ని త‌న భార్య‌కు చెప్పాడు. విశాల్‌ను విజ‌య్ చంపిన‌ట్లు పోలీసుల‌కు భార్య కీర్తి చెప్పారు. దీంతో విజ‌య్‌ను అరెస్టు చేసి 29న రిమాండ్‌కు త‌ర‌లించారు. అనంత‌రం విచార‌ణ నిమిత్తం కోర్టు రెండు రోజుల పాటు పోలీసు క‌స్ట‌డీకి విజ‌య్‌ను అప్ప‌గించింది.