బలగం, దసరాలను అధిగమించి.. ఆస్కార్‌ బరిలో ‘2018’

బలగం, దసరాలను అధిగమించి.. ఆస్కార్‌ బరిలో ‘2018’
  • విదేశీ చిత్రాల విభాగంలో భారత్‌ తరఫున పోటీ


విధాత‌: కేర‌ళను కుదిపేసిన భారీ వ‌ర‌ద‌లు, ఆ స‌య‌యంలో ఎదురైన సంక్షోభాన్ని ఇతివృత్తంగా వ‌చ్చిన మ‌ల‌యాళం సినిమా ‘2018’. త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి ఇత‌ర భాష‌ల్లోనూ దుమ్ముదులిపేసింది. తాజాగా భార‌త్ నుంచి ఆస్కార్ పుర‌స్కారం ప‌రిశీల‌న‌కు వెళ్లే అధికారిక చిత్రంగా 2018ని ఎంపిక చేస్తూ జ్యూరీ నిర్ణ‌యం తీసుకుంది.


ఎవ్రీ వ‌న్ ఈజ్ ఏ హీరో అనే ఉప‌శీర్షిక‌తో వ‌చ్చిన ఈ స‌ర్వైవ‌ల్ డ్రామాను జ్యూడ్ ఆంథోనీ జోసెఫ్ హృద్యంగా, ఉత్కంఠ‌భ‌రితంగా తెర‌కెక్కించారు. టోవినో థామ‌స్‌, కుంచ‌కో బాబ‌న్‌, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీ‌నివాస‌న్‌, నారాయ‌ణ్‌, లాల్ వంటి న‌టీన‌టులు క‌థ‌లో లీన‌మై జీవించారు. ఈ ఏడాది మేలో విడుద‌లైన ఈ సినిమా మ‌ల‌యాళంలో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా నిలిచి రికార్డు సృష్టించింది.


ద‌ర్శ‌కుడు ఆంథోనీ, సెల‌క్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతూ.. ప‌ర్యావ‌ర‌ణ మార్పుల‌ను

సినిమాలోకి అత్యంత అద్భుతంగా తీసుకొచ్చినందునే 2018ని భార‌త్ నుంచి అధికారిక చిత్రంగా పంపుతున్న‌ట్లు తెలిపారు. మొత్తం 16 మంది స‌భ్యుల‌తో ఉన్న సెల‌క్ష‌న్ క‌మిటీ ద కేర‌ళ స్టోరీ, రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ క‌హానీ, మిస్ ఛ‌ట‌ర్జీ వ‌స్ నార్వే, బ‌ల‌గం, వాల్వీ, బాప్లోయాక్, ఆగ‌స్టు 16, 1947 చిత్రాల‌ను ప‌రిశీలించిన‌ప్ప‌టికీ 2018కే క‌మిటీ ఓటేసింది.


ఆస్కార్‌ సెలక్షన్‌ కమిటీని ప్రతి ఏడాది ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు చేస్తుంటుంది. వివిధ భాషల సినీ పరిశ్రమల నుంచి ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి.. అందులోంచి ఆస్కార్‌ బరిలోకి పంపే చిత్రాన్ని ఇది నిర్ణయిస్తుంది. గడిచిన కొన్నేళ్లలో లాస్ట్‌ పిక్చర్‌ షో (2022), కూళంగళ్‌ (2021), జల్లికట్టు (2020), గల్లీబాయ్‌ (2019), విలేజ్‌ రాక్‌స్టార్స్‌ (2018) ఆస్కార్‌ పురస్కారం కోసం పోటీ పడ్డాయి.


ఇంత వరకూ భారతదేశం ఉత్తమ విదేశీ భాషా చిత్రాల్లో ఆస్కార్‌ అవార్డును గెలుచుకోలేక పోయింది. గతంలో మూడు సినిమాలు.. మెహబూబ్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ‘మదర్‌ ఇండియా’ (1957), మీరా నాయర్‌ దర్శకత్వం వహించిన ‘సలాం బాంబే’ (1988), అశుతోష్‌ గోవిర్కర్‌ దర్శకత్వంలో వచ్చిన లగాన్‌ (2001) ఫైనల్‌ నామినేషన్ల దశ వరకూ వెళ్లగలిగినా.. అవార్డు మాత్రం గెలుచుకోలేకపోయాయి.


అయితే.. ఆస్కార్‌ బరిలోకి పంపే చిత్రాల ఎంపిక విధానంపైనే విమర్శలు ఉన్నాయి. ఒక దశలో జీన్స్‌, ఇండియన్‌, బర్ఫీ వంటి కమర్షియల్‌ సినిమాలను ఎంపిక చేశారు. 2013లో లంచ్‌ బాక్స్‌ గట్టి పోటీదారుగా అంతా భావించినా.. గుజరాతీ సినిమా ది గుడ్‌ రోడ్‌ ఎంపిక కావడం అందరినీ ఆశ్చర్యపర్చింది. గతేడాది కూడా తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌కు బదులు.. లాస్ట్‌ పిక్చర్‌ షోను ఎంపిక చేయడంపైనా విమర్శలు వచ్చాయి.


నిజానికి ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకే హాలీవుడ్‌ దర్శకుల్లో హర్షామోదాలు లభించాయి. అయితే.. నాటు నాటు పాటకు గాను ఒరిజినల్‌ సాంగ్‌ క్యాటగిరీలో భారతదేశానికి మొట్టమొదటి ఆస్కార్‌ అవార్డు లభించింది. దీనితోపాటు కార్తీకి గొంజాల్వెజ్‌ దర్శకత్వం వహించిన ది ఎలిఫెండ్‌ విస్పరర్స్‌ ఉత్తమ డాక్యుమెంటరీ (స్వల్ప వ్యవధి) అవార్డు గెలుచుకున్నది.