జనంలో వ్యతిరేకత రాగానే తెరపైకి దేవుళ్లు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల దేశ ప్రజల్లో వ్యతిరేకత ఎదురైన ప్రతిసారీ దేవుళ్లను మోదీ తెరపైకి తెస్తుంటారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.

- మరోవైపు చైనా, పాకిస్థాన్ బూచీలు
- ప్రజలను మభ్యపెడుతున్న ప్రధాని మోదీ
- బీజేపీ సర్కార్ కుట్రపూరిత రాజకీయం
- కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు తిప్పికొట్టాలి
- దేశాన్ని అప్పుల్లో ముంచిన మోదీ పాలన
- ధనికులు సంపన్నులు అవుతుంటే..
- పేదలు మరింత నిరుపేదలవుతున్నారు
- తప్పుడు విధానాలతో గెలిచేందుకు బీజేపీ యత్నం
- మోదీ ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలి
- కాంగ్రెస్ బూత్‌లెవల్ కన్వెన్షన్‌లో
- ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
విధాత : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల దేశ ప్రజల్లో వ్యతిరేకత ఎదురైన ప్రతిసారీ చైనా, పాకిస్తాన్ సమస్యలను.. దేవుళ్లను మోదీ తెరపైకి తెస్తుంటారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రజలను మభ్యపెడుతూ ప్రధాని సాగిస్తున్న మోసపూరిత కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసే దిశగా గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ బూత్ లెవల్ కన్వెన్షన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖర్గే.. మోదీ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు.
మోదీ పాలనలో దేశంలో ధనవంతులు ఇంకా సంపాదిస్తూ మరింత సంపన్నలవుతుండగా, పేదలు మరింత పేదవారవుతున్నారన్నారని చెప్పారు. పదేళ్ళ మోదీ పాలన దేశాన్ని అప్పుల్లో ముంచిందని, 155 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. దేశంలోని యువతను మోదీ మోసం చేస్తున్నారని, అగ్నివీర్ పేరుతో యువత నాలుగేళ్లు పనిచేసి రిటైర్ అయిన తర్వాత వారు ఏం చేయాలని నిలదీశారు. మోదీ రైతులను మోసం చేశారని, వ్యవసాయమంటే తెలియని ప్రధాని.. పంటలకు మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.
రైతులు ఢిల్లీలో నెలల తరబడి ఉద్యమాలు చేస్తే మూడు నల్ల చట్టాలను విరమించుకున్నారని ఖర్గే గుర్తు చేశారు. మరోసారి మోదీ తప్పుడు విధానాలతో గెలవాలని చూస్తున్నాడని, ఆయన చేసే ప్రచారంపై అప్రమతంగా ఉండాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల సందర్భంగా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, నల్లధనాన్ని వెనక్కి తెస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు ఇస్తామని వాగ్దానాలు చేశారని, కానీ పదేళ్లలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎంపీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభమైందని, దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రజలపై దౌర్జన్యాలను అరికట్టడమే ఈ యాత్ర ఉద్దేశమని మల్లికార్జున ఖర్గే చెప్పారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ప్రయాణం దేశంలోని యువత, మహిళలు, పేదల కోసమేనని, మనమందరం ఆయనకు మద్దతు ఇవ్వాలన్నారు. మరో 2 నెలల్లో దేశంలో ఎన్నికలు జరగనున్నాయన్న ఖర్గే.. ఎన్నికల్లో కలిసి పోరాడాలని, బ్లాక్ లెవల్, బూత్ లెవల్, స్టేట్ లెవల్ నాయకులంతా కలిసి పార్టీ కోసం పని చేయాలని కోరారు. బూత్ కమిటీలు జాగ్రత్తగా ఉండి, కష్టపడి కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. మీ అందరి కృషి వల్లే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిందంటూ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణను దేశానికే మోడల్‌గా తీర్చిద్దాలి
తెలంగాణను అందరి కృషితో దేశానికే మోడల్‌గా తీర్చిదిద్దాలని ఖర్గే పార్టీ శ్రేణులను, నాయకులను కోరారు. దేశంలోని మిగిలిన ప్రభుత్వాలు ఈ నమూనాను ఉదాహరణగా చూపుతాయని, ఈ పాలనను అనుసరిస్తాయని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండింటిని అమలు చేశామని, మరికొద్ది రోజుల్లో మరో రెండు హామీలను అమలు చేసుకోబోతున్నామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ముంగిట మోదీ, షా ప్రేరేపిత ఈడీ, ఐటీ, సీబీఐ సోదాలకు అవకాశముందని పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. ఎలాంటి బెదిరింపులకూ తలొగ్గకుండా ప్రజాస్వామ్యాన్ని, కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలన్నారు.
బీజేపీ భయపెట్టే ప్రయత్నం చేస్తోందని, కానీ బీజేపీకి తెలంగాణలో ఎవరు భయపడరని ఖర్గే స్పష్టం చేశారు. ఓవైపు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నామని చెబుతూ మరోవైపు దానిని బలహీనపరుస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని విమర్శించినందుకు 146 ఎంపీలను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. మోదీ పదేళ్లుగా అన్ని సంస్థలనూ నాశనం చేశారని చెప్పారు. మోదీ కుట్రలను బహిర్గతం చేయాలన్నారు. ప్రధానిగా మణిపూర్ అల్లర్ల బాధితులను పరామర్శించకపోవడం శోచనీయమన్నారు.
దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గొప్ప దార్శనికుడని మల్లికార్జున ఖర్గే కొనియాడారు. ఆయన దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్తులు కట్టారని, పరిశ్రమలు ఏర్పాటు చేశారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారని గుర్తు చేశారు. ఇటీవల అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ చేసిన వన్ మ్యాన్ షోను ప్రస్తావించిన ఖర్గే.. మోదీ ఒక్కరే అయోధ్యలో గర్భగుడిలో పూజలు చేశారని, అద్వానీ, మనోహర్ జోషిలను కూడా రానియ్యలేదని విమర్శించారు. దేశంలో దేవుడు ప్రతి ఇంట్లో ఉన్నాడని, కానీ దేవుడు తమ దగ్గరే ఉన్నట్టు మోదీ ప్రచారం చేసుకుంటారని ఆరోపించారు.