కాంగ్రెస్‌ 40 సీట్లు గెలిస్తే అదే గొప్ప

లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ నుంచి కాంగ్రెస్‌కు సీట్లు ఇచ్చేది లేదన్న బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ఆ పార్టీపై విమర్శల దాడి తీవ్రతరం చేశారు

కాంగ్రెస్‌ 40 సీట్లు గెలిస్తే అదే గొప్ప
  • టీకొట్టుకు రానివారు ఇప్పుడు వస్తున్నారు
  • ఇదొక కొత్త స్టైల్‌.. ఫొటో షూట్‌
  • బెంగాల్‌ సీఎం మమత వ్యాఖ్యలు
  • ప్రాంతీయ పార్టీలతో కేంద్రంలో ప్రభుత్వం
  • ఎన్నికల అనంతరం కూటమి ఏర్పాటు

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ నుంచి కాంగ్రెస్‌కు సీట్లు ఇచ్చేది లేదన్న తృణమూల్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ.. ఆ పార్టీపై విమర్శల దాడి తీవ్రతరం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనీసం 40 సీట్లయినా వస్తాయో రావోనని అనుమానాలు వ్యక్తం చేశారు. బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మమతాబెనర్జీ.. ‘కాంగ్రెస్‌ పోటీ చేసే 300 స్థానాల్లో 40 సీట్లయినా వస్తాయో రావో, ఎందుకు అంత పొగరు? మనం ఇండియా కూటమిలో ఉన్నాం. మీకు దమ్ముంటే వారణాసిలో బీజేపీని ఓడించండి’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ గతంలో గెలిచిన స్థానాల్లో కూడా ఓడిపోతుందని అన్నారు. ‘మాకు ఉత్తరప్రదేశ్‌లో ఒక్క సీటు కూడా లేదు. రాజస్థాన్‌లో మీరు గెలవలేదు. వెళ్లి ఆ సీట్లు గెలవండి. మీరెంత సాహసులో మేమూ చూస్తాం. వెళ్లి అలహాబాద్‌లో గెలవండి. వారణాసిలో గెలవండి. మీ గొప్ప ఏంటో తెలుస్తుంది’ అని దుయ్యబట్టారు.

భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సందర్భంగా రాహుల్‌ గాంధీ బీడీ వర్కర్లతో సంభాషించడాన్ని ప్రస్తావించిన మమత.. ‘ఇప్పుడు ఒక కొత్త స్టైల్‌ ముందుకు వచ్చింది. అదే ఫొటో షూట్‌. ఇంత వరకూ టీ కొట్లకు వెళ్లనివారు.. ఇప్పుడు బీడీ కార్మికులతో టీ దుకాణంలో కూర్చొంటున్నారు. వారంతా వలస పక్షులు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు బెంగాల్‌లో సీట్లు ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన తర్వాత మమతా బెనర్జీ ఆ పార్టీపై తన గొంతు పెంచారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ మొదటి నుంచీ సీట్ల పంపకాల సూత్రం గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీల విజయాల ప్రాతిపదికగా ఉండాలని వాదిస్తూ వస్తున్నారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌కు 5 శాతమే ఓట్‌ షేర్‌ ఉన్నదంటూ వారికి సీట్లు ఇచ్చేందుకు తృణమూల్‌ నిరాకరించింది.

ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల అనంతరం కూటమి

లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేస్తామని గురువారం ఒక సభలో మమతాబెనర్జీ వ్యాఖ్యానించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమన్న మమత.. తృణమూల్‌ కాంగ్రెస్‌, ఇతర ప్రాంతీయ పార్టీలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు వ్యూహాలను ఖరారు చేస్తాయని చెప్పారు. అయితే వామపక్షాలను కలుపుకొని పోయేందుకు మాత్రం తాను సిద్ధంగా లేనని అన్నారు. ‘మేం కూటమిని కోరుకున్నాం. కానీ కాంగ్రెస్‌ అందుకు అంగీకరించడం లేదు. బీజేపీకి లాభం కలిగించేలా వారు సీపీఎంతో చేయి కలిపారు. ఈ దేశంలో బీజేపీని ఎదుర్కొనేది మేమే’ అని అమె అన్నారు.