Mammoth | త్వరలోనే భూమిపైకి 4 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన మ్యామూత్‌లు..
Mammoth భారీ ఆకారంతో చూడటానికి అంత ఎత్తున ఉండి ఒళ్లు గగుర్పొడిచే ఏనుగుల జాతి మ్యామూత్‌లు. అయితే ఇవి భూమిపై అవి 4 వేల ఏళ్ల క్రితమే అంతరించిపోయాయి. అయితే వీటిని పునరుద్ధరించడానికి శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ భారీ ఏనుగులను పునఃసృష్టించడానికి ఒక స్టార్టప్ కంపెనీ సిద్ధమయింది. అమెరికాకు చెందిన కొలోసల్ అనే కంపెనీ జెనెటిక్ ఇంజినీరింగ్ పద్ధతుల్లో ఈ కలను సాకారం చేయడానికి చూస్తోంది. ఈ కంపెనీకి డీ […]

Mammoth
భారీ ఆకారంతో చూడటానికి అంత ఎత్తున ఉండి ఒళ్లు గగుర్పొడిచే ఏనుగుల జాతి మ్యామూత్‌లు. అయితే ఇవి భూమిపై అవి 4 వేల ఏళ్ల క్రితమే అంతరించిపోయాయి. అయితే వీటిని పునరుద్ధరించడానికి శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ భారీ ఏనుగులను పునఃసృష్టించడానికి ఒక స్టార్టప్ కంపెనీ సిద్ధమయింది. అమెరికాకు చెందిన కొలోసల్ అనే కంపెనీ జెనెటిక్ ఇంజినీరింగ్ పద్ధతుల్లో ఈ కలను సాకారం చేయడానికి చూస్తోంది.
ఈ కంపెనీకి డీ ఎక్స్‌టింక్షన్ కంపెనీ అనే పేరూ ఉంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించడానికి కావాల్సిన నిధులను ఇప్పటికే ఈ సంస్థ సేకరించింది. ఆసియన్ భారీ ఏనుగుకు జెనెటిక్ ఇంజినీరింగ్ చేసి మామూత్‌కు దగ్గరగా ఉన్న భారీ ఏనుగును పుట్టిస్తారు. ఆ తర్వాత ఈ సంతతిని వృద్ధి చేయడానికి ఆర్కిటిక్ ప్రాంతంలో వదులుతారు. ఇదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే దీనిపై ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తల్లో ఆసక్తి అదే సమయంలో అనుమానాలూ తలెత్తుతున్నాయి.
ఇవే ఇబ్బందులు
ఈ ప్రాజెక్టు ముందుకు సాగే కొద్దీ కొలోసల్‌కు పలు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. వాటిలో ఒకటి మామూత్ జీన్‌ను సీక్వెన్స్ చేయడం. ఎగ్‌ను ఫలదీకరణం చెందించడం, వాటిలోకి హైబ్రిడ్ జీన్స్‌ను ఎక్కించడం వంటి కీలకమైన దశలు అంత సులువుగా చేసేవేం కావని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సరే ఏదోలా మ్యామూత్‌ను సృష్టించారనుకున్నా ప్రస్తుతం ఉన్న జంతువులకే అడవులు సరిపోని ఈ కాలంలో వీటికి సరిపడా ఆహారాన్ని సంపాదించుకుని బతకగలుగుతాయా అనేది సందేహమే.
అయితే ఈ సమస్య పరిష్కారానికి బోట్సవానా అడవుల్లో తిరుగుతున్న భారీ ఏనుగుల జీవనశైలిని గమనించి.. ప్రణాళిక రూపొందించామని కలోసల్ కంపెనీ చెబుతోంది. మ్యామూత్ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న పలు చర్యల్లో భాగంగా కలోసల్ సంస్థ ఏనుగుల సంరక్షణకు పాటుపడే ఎలిఫెంట్స్ హెవెన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలూ 2017 నుంచి కలిసి పనిచేస్తూ ఏనుగుల ప్రవర్తనను, స్వల్ప స్థాయిలో చూపించే ముఖ కవళికలను, ప్రవర్తనలను ఏఐ ద్వారా సేకరించాయి. వీటన్నింటినీ మ్యామూత్ జీనోమ్ డేటాలో నిక్షిప్తం చేయనున్నారు.
కీలకంగా ఏఐ
మ్యామూత్ ప్రాజెక్టులో కృత్రిమ మేధ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోంది. ‘మేము అమెరికా వ్యాపార సంస్థలు, ఆర్మీ దగ్గర ఉన్న కొన్ని సాంకేతికతలను ఈ ప్రాజెక్టు కోసం ఉపయోగించుకుంటున్నాం. అవి ఈ ప్రాజెక్టులో నేరుగా సాయపడతాయి’ అని కొలోసల్ వ్యవస్థాపకుడు బెన్ లాం వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ సాంకేతికత పర్యావరణ పరిరక్షణలో ఉపయోగపడకపోవడం ఆశ్చర్యమేనని.. ఏఐ సాయంతో వచ్చే 10 ఏళ్లలో ముఖ్యంగా ఏనుగుల సంరక్షణ మరింత సులువుగా చేపట్టే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.