లాలు దెబ్బ.. మోదీ బ్యాచ్‌కు గట్టిగానే తాకినట్టుందే!

ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్‌గా చేసుకుని బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్‌ యాదవ్‌ ఆదివారం చేసిన కామెంట్లు బీజేపీ నాయకులకు గట్టిగానే తగిలినట్టున్నాయి.

లాలు దెబ్బ.. మోదీ బ్యాచ్‌కు గట్టిగానే తాకినట్టుందే!
  • మోదీ బ్యాచ్‌కు గట్టిగా తాకిన లాలు దెబ్బ
  • మోదీ కా పరివార్‌’ క్యాంపెయిన్‌లో బీజేపీ నేతలు
  • లాలు టార్గెట్‌గా తీవ్రస్థాయిలో విమర్శలు
  • తాను దేశం కోసమే జీవిస్తున్నానన్న మోదీ


న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్‌గా చేసుకుని బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్‌ యాదవ్‌ ఆదివారం చేసిన కామెంట్లు బీజేపీ నాయకులకు గట్టిగానే తగిలినట్టున్నాయి. కుటుంబ రాజకీయాలు అంటున్న మోదీకి అసలు కుటుంబమే లేదని లాలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. తల్లి చనిపోతే హిందూ కుటుంబాల్లో శిరోముండనం చేయించుకుని, మీసాలు గడ్డాలు కూడా తీసేస్తారని, కానీ.. మోదీ తన తల్లి చనిపోయినా, గుండు చేయించుకోలేదని, మీసాలు, గడ్డాలు తీయించుకోలేదని చెబుతూ.. అసలు మోదీ హిందువే కాదనీ తేల్చేశారు.


ఆ మర్నాడే మార్చి 4వ తేదీనాడు బీజేపీ నాయకులు లాలూ టార్గెట్‌గా ‘మోదీ కా పరివార్‌’ క్యాంపెయిన్‌ను పెద్ద ఎత్తున ప్రారంభించి, మోదీపై విమర్శలు గుప్పించేందుకు పోటీ పడ్డారు. మోదీకి సంఘీభావంగా అమిత్‌షా, అనురాగ్‌ ఠాకూర్‌, జేపీ నడ్డా తదితరులు తమ ఎక్స్‌ ఖాతాల్లో తమ పేర్లకు ‘మోదీ కా పరివార్‌’ అని తగిలించారు.


కుటుంబ రాజకీయాలపై మోదీ చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్‌ ఇచ్చిన లాలు ప్రసాద్‌ యాదవ్‌.. ఆదివారం నిర్వహించిన జన విశ్వాస్‌ మహా ర్యాలీలో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీకి సొంత కుటుంబం లేకపోతే మనం ఏం చేస్తాం? మాట్లాడితే రామాలయం గురించి గొప్పలు చెప్పుకొంటుంటారు. ఆయన నిజమైన హిందువు కూడా కాదు. తల్లిదండ్రులు చనిపోతే హిందూ సంప్రదాయాల ప్రకారం కుమారుడు గుండు చేయించుకుని, మీసాలు, గడ్డాలు తీసేస్తారు. తన తల్లి చనిపోయినప్పుడు మోదీ ఆ పని చేయలేదు’ అని లాలు విమర్శించారు.


దీనికి స్పందనగా సోమవారం ఒక సభలో మాట్లాడిన మోదీ.. అడిగినవాటికి మాత్రం జవాబివ్వకుండా.. డొంక తిరుగుడు వ్యాఖ్యలు చేశారు. ‘నేను వారి కుటుంబ రాజకీయాలను ప్రశ్నించాను. వారేమో మోదీకి కుటుంబమే లేదంటున్నారు. నా జీవితం తెరిచిన పుస్తకం. నేను నా దేశం కోసమే జీవిస్తున్నాను’ అన్నారు.

అంతకు ముందు బీహార్‌ డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌ విజయ్‌కుమార్‌ సిన్హా కూడా ఆర్జేడీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. లాలు, ఇతర ఆర్జేడీ నాయకుల వైఖరి చూస్తుంటే రాజకీయాల పట్ల చిత్తశుద్ధితో లేరని అర్థమవుతున్నదని చెప్పారు. శతాబ్దాల నాటి సనాతన ధర్మాన్ని నాశనం చేసేవిగా ఉన్నాయని అన్నారు.