ప్రతినెల జాబ్ మేళాలు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రతినెల జిల్లాల్లో మెగా జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు

- త్వరలో ఎంజీయూనివర్సిటీ ఖాళీల భర్తీ
- సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు
విధాత : ప్రతినెల జిల్లాల్లో మెగా జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సోమవారం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్),తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ స్కిల్ సౌజన్యంతో ప్రతీక్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఖాళీల భర్తీ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి అన్ని ఖాళీలను భర్తీ చేయిస్తానన్నారు.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో యూనివర్సిటీ అభివృద్ధికి వంద కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. తెలంగాణలోనే మహాత్మా గాంధీ యూనివర్సిటీని ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలతో ముందుకు వెళ్తుందన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం 13వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు, స్టాఫ్ నర్సులు, గురుకుల నియామకాలతో పాటు పలు శాఖలకు సంబంధించి 25 వేల ఉద్యోగాల నియామకం జరిగిందన్నారు.

గత ప్రభుత్వంలో పేపర్ల లీకేజీ ద్వారా నిరుద్యోగులు ఎన్నో బాధలు పడ్డారన్నారు. తమ ప్రభుత్వంలో అలాంటి బాధలు ఉండవన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగాలను సాధించడంతోపాటు పలువురికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. చదువుకొని జాబ్ సంపాదించుకుంటూ మళ్లీ చదువుకుంటూ అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు.
తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలంటే ఉద్యోగం సాధించి పేదరికం నుంచి బయటపడలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ఉద్యోగాన్ని సాధించి మీ టాలెంట్ నిరూపించుకోవాలన్నారు. నా కూతురు కూడా జాబ్ సంపాదించుకున్న తర్వాత మరో 150 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగిందన్నారు. మీరంతా కూడా అదే స్థాయికి రావాలన్నారు.
ఈ రోజు నిర్వహించిన జాబ్ మేళాలో జాబ్ పొందిన వారికి లక్ష నుంచి 15 లక్షల వరకు ప్యాకేజీలు ఉన్నాయన్నారు. 127 కంపెనీలు 13000 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందన్నారు. గతంలో ప్రతీక్, సుభద్ర ఫౌండేషన్ ల ద్వారా 18141 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, జేఎన్టీయూలో మెగా జాబ్ మేళా నిర్వహించి పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు అందించామన్నారు. ఇక్కడ జాబ్ మేళాను నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ హరిచందన ఎంతో చొరవ తీసుకున్న్నారని అభినందించారు.

జిల్లాలో మరోసారి పెద్ద జాబ్ మేళా నిర్వహించే ఏర్పాటు కూడా ఉన్నదన్నారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తూనే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే నిరుద్యోగులకు ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మెటీరియల్ ను పంపిణీ చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, విశ్వవిద్యాలయం ఉపకులపతి సిహెచ్ గోపాల్ రెడ్డి, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, ఎఫ్ ఎం సి, సి ఈ ఓ సత్యనారాయణ, ప్రతీక్ ఫౌండేషన్ సీఈవో గోనారెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రిశ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ ,ఇతర ప్రజాప్రతినిధులు ,అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.