రేవంత్ దెబ్బకు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండిండు: మంత్రి కోమటిరెడ్డి
‘కాలు గోటికి సరిపోని రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ను మట్టుబెట్టి ఫామ్ హౌస్ లో పండబెట్టిండు. పదవి పోయి బొక్కలు విరిగి ఫామ్ హౌస్ లో పండుకుండు’

– ఆయనకు పదవి పోయి బొక్కలు విరిగాయ్..
– కాళేశ్వరం తినుడే, గుట్టలు కనిపిస్తే తినుడే ..
కట్టిన బ్యారేజ్ లు కూలిపోవుడే..
– బీఆరెస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం దోచుకుంది
విధాత: ‘కాలు గోటికి సరిపోని రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ను మట్టుబెట్టి ఫామ్ హౌస్ లో పండబెట్టిండు. పదవి పోయి బొక్కలు విరిగి ఫామ్ హౌస్ లో పండుకుండు’ అంటూ ఆర్అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గురించి చెప్పాలంటే దేవుడు దగ్గర పాపం తగులుతుందని అన్నారు. గత ప్రభుత్వం యాదాద్రి ఆలయానికి వెయ్యి కోట్లు బడ్జెట్ పెట్టి 1600 కోట్లు అని చెప్పిందని.. అందులో రూ.600 కోట్లకు లెక్కలు లేవని, ప్రతి పైసా అవినీతిని బయటకు తీస్తామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం భువనగిరిలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు.
కేటీఆర్ నీ భాష ఏంది మార్చుకో.. మీ అయ్యా పేరుతో దొంగ మాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యావు అంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ జడ్పీటీసీ, ఎమ్మెల్సీగా గెలిచిన నాయకుడని, అందరి సమష్టి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడవ రోజు నుంచే మూసి ప్రక్షాళన పైన మాట్లాడిన నాయకుడని, మీ అయ్యా , నువ్వు ఎప్పుడైనా మూసి పైన మాట్లాడారా అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. కాళేశ్వరం తినుడే, గుట్టలు కనిపిస్తే తినుడే.. కట్టిన బ్యారేజ్ లు కూలిపోవుడే..అంటూ బీఆరెస్ పాలనలో అవినీతిపై సెటైర్లు వేశారు. కేటీఆర్.. నువ్వు రేవంత్ రెడ్డి చిటికెన వేలుకు కూడా సరిపోవు… జాగ్రత్తగా మాట్లాడు, నీకు ఇంకా బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అహంకారంతోనే నల్లగొండ జిల్లాలో వేల ఓట్లు మెజార్టీతో ఎమ్మెల్యేలుగా గెలిచారని, నల్లగొండ జిల్లాలో ఒక దరిద్రం సూర్యాపేటలోనే ఉందని అన్నారు. ముఖ్యమంత్రి అంటే గౌరవించడం నేర్చుకో కేటీఆర్.. అంటూ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది అంటే చేసే చూపిస్తామని అన్నారు. వాసలమర్రి గ్రామ రోడ్డుపై శ్మశాన వాటిక ఉంది అని.. అది తీస్తే రోడ్డు సక్కగా చేయాలని యాదగిరిగుట్ట పడింతులు చెప్పారు అని మొత్తం గ్రామాన్ని కూలగొట్టిండు.. అంటూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.