జీవ వైవిధ్యమే సమతుల ప్రకృతికి జీవనాధారం

సకల జీవరాసుల మనుగడతో కూడిన జీవ వైవిధ్యమై సమతుల్యమైన ప్రకృతికి జీవనాధారమని, ప్రకృతితో మానవుడి ప్రయాణం సురక్షితమని

  • Publish Date - March 3, 2024 / 10:09 AM IST
  • వన్య ప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత
  • ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవంలో కొండా సురేఖ

విధాత, హైదరాబాద్ : సకల జీవరాసుల మనుగడతో కూడిన జీవ వైవిధ్యమై సమతుల్యమైన ప్రకృతికి జీవనాధారమని, ప్రకృతితో మానవుడి ప్రయాణం సురక్షితమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని, వన్యప్రాణుల మనుగడ, రక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తూ ప్రతి యేటా మార్చి 3 న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం జరుపుకుంటున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు. సాంకేతిక అభివృద్ది, కొత్త ఆవిష్కరణలను వన్యప్రాణుల రక్షణ కోసం వాడాలనే సంకల్పంతో ఈ యేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని (వరల్డ్ వైల్డ్ లైఫ్ డే) జరుపుకుంటున్నామని చెప్పారు. అభివృద్ది పేరిట అడవులు, ఇతర జంతుజాలం పట్ల మనుషుల వైఖరిలో విపరీతమైన మార్పులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వన్యప్రాణుల మనుగడపై తీవ్ర ఒత్తిడి చోటు చేసుకుంటుందని తెలిపారు. మనతో పాటు రానున్న తరాలకు కూడా నివాసయోగ్యమైన పరిసరాలు కావాలంటే అన్ని జీవరాసుల మనుగడ, సహజీవన సూత్రాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

అలాగే మనుషుల నిర్లక్ష్యంతో జరుగుతున్న అటవీ అగ్నిప్రమాదాలను నివారించాల్సిన అవసరముందన్నారు. అటవీ మార్గాల్లో ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో వ్యవహరించాలని కోరారు. ఎండాకాలం జంతువులు, పక్షుల నీటి వసతికి వీలైనంతగా అందరూ సహకరించాలన్నారు. అటవీ నేరాల అదుపుకు, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ నివారణకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని పిలుపునిచ్చారు.