వ్యూహాత్మక నాలాల అభివృద్ధితో ముంపునకు చెక్ : మంత్రి కేటీఆర్
విధాత : హైదరాబాద్ నగరంలో రూ.985.45 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమంతో వరద ముంపును అరికడుతున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామావు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్‌ఎన్‌డీపీ, మెట్రోరైల్, చార్మినార్ తదితర ప్రాంతాల అభివృద్ధి పనులకు సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఎస్‌ఎన్‌డీపీలో చేపట్టిన 56 పనులకు రెండింటికి మాత్రమే టెండర్ కాలేదని, మిగతా వాటిలో కొన్ని పూర్తయ్యాయని, మరికొన్ని పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 2020లో […]

విధాత : హైదరాబాద్ నగరంలో రూ.985.45 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమంతో వరద ముంపును అరికడుతున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామావు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్‌ఎన్‌డీపీ, మెట్రోరైల్, చార్మినార్ తదితర ప్రాంతాల అభివృద్ధి పనులకు సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఎస్‌ఎన్‌డీపీలో చేపట్టిన 56 పనులకు రెండింటికి మాత్రమే టెండర్ కాలేదని, మిగతా వాటిలో కొన్ని పూర్తయ్యాయని, మరికొన్ని పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 2020లో వర్షాలు వచ్చిన సమయంలో చాలాకాలనీలో ఇబ్బందులు ఎదురైతే ఈ సారి ఇబ్బందులు తప్పాయన్నారు.
ఎల్‌బీనగర్ జోన్‌లో సాయిరాంనగర్, మఫ్తానగర్, రాఘవేంద్రకాలనీ, గేట్‌వ్యూ కాలనీ, లేక్‌వ్యూ కాలనీ, మమతనగర్, అరుణోదయకాలనీలో ఎస్‌ఎన్‌డీపీ పుణ్యమాని ఇబ్బందులు తప్పాయన్నారు. సికింద్రాబాద్ జోన్‌లో రిజిస్ట్రేషన్ కాలనీ, జూపల్లి హోమ్స్, స్వర్ణాంధ్రకాలనీ, ఖైరతాబాద్ జోన్‌లో అంబేద్కర్, హబీబ్‌నగర్, అన్నానగర్, మంగళ్‌బస్తీ, బీహెచ్‌కాలనీ, సౌత్ జోన్‌లో అషుమాబాద్, అలీనగర్, గౌస్‌నగర్, శుభంకాలనీ తదితర ప్రాంతాల్లో వరద ముప్పు సమస్య తొలగిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 35 పనులకు 11 పూర్తి చేశామన్నారు. హైదరాబాద్ నగరంలో వందేళ్ల కిందట నిర్మించిన నాలాలే ఉన్నాయని, నాలాలపై 28 వేల మంది పేదలు ఇండ్లు కట్టుకున్నారన్నారు. ఎస్‌ఎన్‌డీపీ దేశంలో ఏ నగరంలోనూ లేదన్న కేటీఆర్.. ఎస్‌ఎన్‌డీపీ ఫేజ్-2కు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది..
హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్ని అధునాతన భవంతులు వెలసినా హైదరాబాద్ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదన్నారు. గుల్జార్‌హౌస్, మీర్-ఆలం-మండి, ఆషుర్ ఖానాకు పూర్వవైభవం తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. మదీనా నుంచి పత్తర్‌గట్టి వరకు పనులు పూర్తికావచ్చాయని, పాతబస్తీలో సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టినట్లు వివరించారు. చార్మినార్ నుంచి దార్-ఉల్-ఉలం స్కూల్ వరకు రోడ్డు వెడెల్పు పనులు పూర్తయ్యాయని, హుస్సేనీ ఆలం నుంచి దూద్‌బౌలి వరకు విస్తరణ పనులు జరుగుతున్నట్లు వివరించారు. హెరిటేజ్ భవంతుల పూర్వవైభవం కోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోమని కేటీఆర్ సభ్యులకు తెలిపారు.
మెట్రోకు కేంద్రం సహకరించడం లేదు
‘వడ్డించే వాళ్లు మనవాళ్లయితే’ అన్నట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు సహకరించడం లేదని, ప్రతిపాదనలు పంపినా స్పందించడం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మెట్రోలకే నిధులిస్తుందని విమర్శించారు. 1.20కోట్ల మంది నివసిస్తున్న హైదరాబాద్‌కు నిధులు ఇవ్వడానికి కేంద్రానికి శత్రుదేశంపై పగబట్టినట్లుగా తెలంగాణపై కేంద్రం కక్షగట్టిందని మండిపడ్డారు. ఢిల్లీ మెట్రో అధికారులతో హైదరాబాద్ మెట్రో ఆడిటింగ్ చేయించామని తెలిపారు.
అమీర్‌పేట మెట్రో స్టేషన్ ఎంత కిక్కిరిసిపోతుందో అందరికీ తెలుసునని, 80 శాతానికిపైగా తెలంగాణ పిల్లలే పని చేస్తున్నారని పేర్కొన్నారు. మెట్రో ధరలు ఇష్టంవచ్చినట్లు పెంచితే ఊరుకోబోమని, ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని మెట్రో అధికారులకు సూచించామని చెప్పారు. రూ.6250 కోట్లతో ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టామని, శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను మూడేండ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ అంటే చార్మినార్ అని అందరికీ తెలుసుని, పాతబస్తీకి మెట్రో పనులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కేటీఆర్ వివరించారు.