వందరోజుల పాలనలో ఏం చేశామంటే..
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి నేడు శుక్రవారం నాటికి వందరోజులు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధి గురించి మంత్రి పొంగులేటి

- విధ్వంసకర పాలన నుంచి ప్రజా పాలనలోకి
- వందరోజుల పాలనపై మంత్రి పొంగులేటి ప్రకటన
విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి నేడు శుక్రవారం నాటికి వందరోజులు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధి గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 7వ తేదీ యావత్ తెలంగాణ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక రోజు, ఆత్మ గౌరవం పెంపొందిన రోజు అన్నారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ లక్ష్యం దిశగా పనిచేస్తున్నామన్నారు. విధ్వంసం తరువాత ఆయా వ్యవస్థలను పునర్మించుకోవడం తేలికైన పని కాదు, కానీ తెలంగాణను తిరిగి బాగు చేసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం శక్తినంత కూడగట్టుకొని ఒక్కో అడుగు వేసుకుంటూ ఇచ్చిన వాగ్దానాలు తూచ తప్పకుండా అమలు చేస్తున్నదన్నారు.
ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ఆరు గ్యారంటీలను మంత్రివర్గం ఆమోదించి 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పరిమితిని పది లక్షలకు పెంచి చరిత్ర సృష్టించిందన్నారు. అలాగే 80 రోజుల్లోనే గృహ విద్యుత్ కనెక్షన్ పై 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 40 లక్షల మంది మహిళలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించే మహాలక్ష్మి ఎల్.పీ.జి. పథకాన్నిఅమలు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4.5 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
కాంగ్రెస్ వందరోజుల పాలనలో దేశంలో ఎక్కడా జరగని విధంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తి జరిగిందన్నారు.
మూడు నెలల్లోనే 29వేలకు పైగా ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందచేయడం, ఉద్యోగ వయోపరిమితి పెంచడం, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం, గ్రూప్ పరీక్షలకు తేదీలు ప్రకటించడం నిరుద్యోగుల్లో ఆనందం నింపిందన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో జరిగిన కాలయాపనతో వయోపరిమితి దాటిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు ఉండగా ఇప్పుడు 46 సంవత్సరాలు పెంచడం జరిగిందన్నారు.
ప్రతివారం ప్రజాభవన్ లో రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటుందని, అది మాత్రమే కాకుండా సచివాలయంలో మంత్రులు, ముఖ్యమంత్రి నిత్యం అందుబాటులో ఉంటున్నారని దీంతో ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవచ్చన్న నమ్మకం ఏర్పడిందన్నారు. రెవెన్యూ శాఖలో ముఖ్యమైన సమస్యగా ఉన్న ధరణి పోర్టల్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని, ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆంక్షలు లేని వాతా వరణం ఏర్పడిందని, బలహీన వర్గాల బలోపేతం కోసం రాష్ట్రంలో కులగణన చేపట్టాలని అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగిందన్నారు. తెలంగాణకు 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామివేత్తలు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు.
రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం చౌటుప్పల్, ఆమన్ గల్, షాద్ నగర్, సంగారెడ్డిలపై 1082 కిలోమీటర్ల జాతీయ రహదారికి మోక్షం లభించింది. రాజీవ్ రహదారిపై దీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఎక్స్ ప్రెస్ కారిడార్ కి, పాతబస్తీకి కొత్త అందాలు తెచ్చే మెట్రోరైలు ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేయడం వంటి కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.