ఐదెకరాల వరకు శుక్రవారంతో రైతుబంధు పూర్తి

పార్లమెంట్ ఎన్నికల తరువాత నేనే సీఎం అనడం ఊహాజనితమని, కాంగ్రెస్‌లో నేను చాల జూనియర్‌ని అని, నేనెలా సీఎం అవుతానంటూ మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • By: Somu    latest    Mar 21, 2024 12:03 PM IST
ఐదెకరాల వరకు శుక్రవారంతో రైతుబంధు పూర్తి
  • నేను సీఎం అనడం ఊహాజనితమే
  • కాంగ్రెస్‌లో నేను జూనియర్‌ను
  • బీజేపీతో టచ్‌లోకి వెళ్లానంటూ దుష్ప్రచారం
  • మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు


విధాత: పార్లమెంట్ ఎన్నికల తరువాత నేనే సీఎం అనడం ఊహాజనితమని, కాంగ్రెస్‌లో నేను చాల జూనియర్‌ని అని, నేనెలా సీఎం అవుతానంటూ మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం పర్యటనలో పొంగులేటి మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. సీఎం అవుతానని నేను అనుకుంటే అది బుద్ధి తక్కువ తనం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసుకుంటున్నారన్నారు.


పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలని అందుకే నన్ను ట్రోలింగ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. హైకమాండ్ కూడా నేను సీఎం కావాలంటే కొన్ని ఈక్వేషన్స్ చూస్తుంది కదా అని, నేను సీఎం కావాలని అనుకోవట్లేదని, అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట రోజు ఉంటే నంబర్ 2 ఎలా అవుతానని ప్రశ్నించారు.


నేను బీజేపీలోకి టచ్‌లోకి వెళ్లానంటున్న ప్రచారం అంతా అబద్ధం..ఊహాగానమన్నారు. తెలంగాణకి రావాల్సిన నిధులపై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదని, గత బీఆరెస్‌ ప్రభుత్వం కొంతమంది నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసిందన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి చర్యలకు పాల్పడదని.. అధికారం ఎక్కడ కోల్పోతామన్న భయంతో కేసీఆర్ భయపడి ఇష్టరితీగా ఫోన్లను ట్యాప్ చేశారని మండిపడ్డారు. తమకు అలాంటి భయం లేదని అన్నారు. బీఆరెస్‌ మీద తాము కక్ష పూరితంగా కేసులు పెట్టడం లేదని, ఆ కేసులన్నీ గత ప్రభుత్వంలో వారు అధికార దుర్వినియోగంతో చేసిన అవినీతి, అక్రమాల ఫలితమన్నారు. . ధరణిపైత్వరలోనే శ్వేతపత్రంవిడుదల చేస్తామని, ధరణకి సంబంధించి తన వద్ద మరింత సమాచారం ఉందని చెప్పారు.


5 ఎకరాలకు రైతుబంధు అని చెప్పినట్లే ఇస్తున్నామన్నాని, శుక్రవారంతో ఐదు ఎకరాల వారందరికి ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయని తెలిపారు. జీతాలు చెల్లింపు సాధ్యమైనంత వరకు ఒకటవ తేదీనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మేం చెప్పినట్లుగానే హామీల అమలుతో ముందుకెలుతున్నామన్నారు. గత పాలకుల అవినీతి మీద పోరాడుతూనే వారు చేసిన తప్పులను సరిదిద్దుతున్నామన్నారు.


తెలంగాణలో 11 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సెక్యులర్ పార్టీయైన కాంగ్రెస్‌కు ఎంఐఎం మద్దతునిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆరెస్ ఒకటి రెండు సీట్లు గెలిచినా గొప్పేనన్నారు. ఇతర పార్టీల నుండి మా పార్టీలోకి రమ్మని మేము ఎవరిని అడగటం లేదన్నారు. వారంతా వారే స్వచ్ఛందంగా వస్తున్నారని మేము గేట్లు ఎత్తలేదని, ఎత్తితే వరద ఆగదని చెప్పారు. రిజిస్ట్రేషన్‌ శాఖను ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు.


కొన్ని మీడియా సంస్థలు కరవు ఫోటోలు, వీడియోలను పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వం డిసెంబర్‌లో ఏర్పడిందని, గత వర్షాకాలంలో బీఆరెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు. బీఆరెస్ పాలన కాలంలో ఏర్పడిన కరవును కూడా మాపై రుద్దాలని బీఆరెస్ చూస్తుందని విమర్శించారు. అలాగే వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూస్తామని చెప్పారు.


రాబోయే ఎండాకాలంలో దృష్టిలో పెట్టుకొని రిజర్వాయర్‌లలో నీటి నిలువలు ఉంచాల్సిన బాధ్యత గత ప్రభుత్వంపై ఉండగా అలా చేయకుండా మాపై రాళ్లేస్తుందని విమర్శించారు. లక్షకోట్లు పెట్టిన కాళేశ్వరం ఫలితం ఎవరికి దక్కిందో అందరికీ తెలిసిందేనని, పిల్లర్ల డ్యామేజీ ఒకటి రెండింటితో ఆగేది కాదన్నారు. జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు.