ఫోన్ ట్యాపింగ్ నిందితులపై చర్యలు తీసుకుంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ‌లో సంచ‌ల‌నం రేపుతున్న ఫోన్‌ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స్పందించారు. ట్యాపింగ్ కేసు నిందితుల‌పై చ‌ట్ట ప్ర‌కారంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు

  • By: Somu    latest    Mar 27, 2024 11:44 AM IST
ఫోన్ ట్యాపింగ్ నిందితులపై చర్యలు తీసుకుంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్
  • ప్ర‌కృతికి సంబంధించిన విష‌యాన్ని బీఆరెస్ రాజ‌కీయం చేస్తోంది

విధాత‌: తెలంగాణ‌లో సంచ‌ల‌నం రేపుతున్న ఫోన్‌ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స్పందించారు. ట్యాపింగ్ కేసు నిందితుల‌పై చ‌ట్ట ప్ర‌కారంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. బీఆరెస్ నాయ‌కులు వర్షపాతాన్ని, కరువుకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. 2020లో వ‌ర్ష‌పాతం ఎంత న‌మోదైంది, 2023లో ఎంత మేర‌కు వ‌ర్షాలు కురిశాయని మంత్రి ప్ర‌శ్నించారు. క‌రువుకు బీఆరెస్ కార‌ణం కాదు అలాగే కాంగ్రెస్ కూడా కార‌ణం కాద‌న్నారు. ప్ర‌కృతికి సంబంధించిన విష‌యాన్ని బీఆరెస్ పార్టీ రాజ‌కీయం చేస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీఆరెస్ హ‌రీష్ రావు మాజీ మంత్రి అవ్వ‌గానే వాస్త‌వాల‌కు పూర్తిగా బిన్నంగా మాట్లాడుతున్నారని వెల్ల‌డించారు.


అరేబియాలో ఏర్ప‌డిన ఎల్‌నినో కార‌ణంగా వ‌ర్ష‌పాతం తగ్గింద‌ని, గతంలో 1091.8 ఎంఎంలో వర్షపాతం నమోదైంది, ఈసారి చాలా తక్కువ వర్షపాతం నమోదైందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పంట భీమా పథకం పెట్టక పోవడంతో రైతులకు నష్టం జరిగింద‌ని, అదే గ‌నుకు పెట్టి ఉంటే రైతులు ప్రాణాలు కోల్పోయే వారు కాద‌న్నారు. గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతులకు మద్దతు ధరలు, కొనుగోలు కేంద్రాలు వంటి స‌దుపాయాలు ఏవి ఉన్న కూడా వాటికి సంబంధించిన చ‌ర్య‌లు వెంట‌నే తీసుకునేద‌ని వెల్ల‌డించారు. రైతుల‌కు సంబంధించి కోర్టు తీర్పు ఇస్తే కూడా న‌ష్ట‌పోయిన అన్న‌దాత‌ల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఎందుకు చెల్లించ‌లేద‌ని మంత్రి పోన్నం ప్ర‌శ్నించారు.


తాజాగా న‌ష్ట‌పోయిన రైతుల‌కు న‌ష్ట ప‌రిహార విష‌యంలో ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌న్నారు. రైతు బంధు ఇచ్చిన వారిని కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంద‌ని, ఇవ్వ‌ని వాళ్ల‌ను మీరు అడ‌గండ‌ని అన్నారు. కాళేశ్వ‌రం బారాజ్ కుంగి పోయింది, మీ హ‌యాంలో జ‌రిగిన ప్రాజెక్టులో ఏం జ‌రిగిందో కూడా చెప్ప‌లేద‌న్నారు. న‌ష్టం ఏం జ‌రిగింద‌ని చెపప‌కుండా కుట్ర కోణం దాగి ఉంద‌ని కేసు పెట్టార‌ని మండి ప‌డ్డారు. కానీ ఆ కుట్ర కోణం ఏంట‌ని ఇంత వ‌ర‌కు ఎందుకు బ‌య‌ట పెట్టలేద‌న్నారు. కేసీఆర్ మాన‌స పుత్రిక అయిన కాళేశ్వ‌రం చెడిపోతే బాధ్య‌త మాపై ఉంటుందా అని ప్ర‌శ్నించారు. 10 సంవత్సరాల్లో ఏనాడు రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ మేము అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ప్ర‌క్రియ మొద‌లు పెట్టామ‌న్నారు. ఇచ్చిన హామీల‌న్నీ కాంగ్రెస్ తీరుస్తుంద‌ని పేర్కొన్నారు.


డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన వార‌ని మీరు ఓట్లు అడ‌గండీ.. ఇందిరమ్మ ఇండ్లుఉన్న ఊర్లలో మేము ఓట్లు అడుగుతామ‌ని పొన్నం వ్యాఖ్యానించారు. రైతు బంధువిష‌యంపై మాట్లాడిన మంత్రి ఐదు ఎక‌రాల లోపు ఉన్న రైతులంద‌రికీ రైతు బంధు వేశామ‌ని, మిగ‌తా వారికి కూడా త్వ‌ర‌లోనే రైతు బంధు అందుతుంద‌న్నారు. బీఆరెస్ అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్ల రాష్ట్రం అప్పుల పాలైంద‌ని విమ‌ర్శించారు. బీఆరెస్ ప్ర‌భుత్వం అధికారంనుంచి దిగే స‌రికి 7 లక్షల కోట్ల అప్పులు చేయడంతో పాటు, 40 వేల కోట్ల బకాయిల భారం ప‌డింద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం వ‌స‌తి గృహాల్లో ఉన్న పిల్ల‌ల‌కు మెస్ బిల్లులు కూడా చెల్లించ‌లేక పోయింద‌న్నారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ల‌సి పనిచేయాలి కానీ కేసీఆర్ ప్ర‌ధాని వ‌స్తే క‌నీసం క‌లిసే పరిస్థితి కూడా లేద‌న్నారు.


కాంగ్రెస్ అలాంటి ప‌నులు చేయ‌ద‌ని కేంద్రంతో సత్సంబంధాలు కొన‌సాగించి మ‌న‌కు రావాల్సిన వాటాను త‌ప్ప‌కుండా తీసుకుంటామ‌న్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మెట్రో, మూసి, తాగు నీటి సమస్యలు, తదితర అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం మిషన్ భగీరథ ద్వారా 100శాతం నీరు ఇచ్చిన‌ట్లు కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కానీ ఇక్క‌డ మాత్రం ఎక్క‌డిక్క‌డ నీరులేని ప‌రిస్థితి నెల‌కొన్న‌ద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు తాగునీటి ఎద్ద‌డి రాకుండా స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.ఎన్నికల కోసం సీఎస్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఎక్క‌డా ఇబ్బందులు లేకుండా చూస్తున్నామ‌న్నారు. రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌న్నారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్.