రేషన్ కార్డులపై తప్పుడు ప్రచారం : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు

విధాత: తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. రేషన్‌కార్డుల రద్దు ప్రచారం పూర్తిగా అవాస్తవమని, మా ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డును తొలగించలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక్క మేడ్చల్ జిల్లాలోనే 95,040 రేషన్ కార్డులు రద్దు అయ్యాయని త్వరలో మిగాతా జిల్లాలోనూ ఇదే స్థాయిలో రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉందనే ప్రచారంతో లబ్దిదారులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఈ ప్రచారంపై ఎంఐఎం అధ్యక్షుడు ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇవ్వాలని ట్వీట్టర్ వేదికగా కోరారు.
దీనిపై స్పందించిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి రేషన్ కార్డుల రద్దు ప్రచారం పూర్తిగా అబద్ధం అని కొట్టిపారేశారు. తమ ప్రభుత్వం ఒకవైపు అభయ హస్తం పథకాల కోసం ప్రజాపాలన సభల ద్వారా దరఖాస్తులు తీసుకుంటుంటే తామేందుకు రేషన్ కార్డులు రద్దు చేస్తామంటు ఉత్తమ్ అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలతో ప్రజలను మోసం చేసే వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.