కాళేశ్వరంపై జ్యూడిషియల్ విచారణ: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం ప్రాజెక్టుకు అవకతవకలపై జ్యూడిషియల్ విచారణ జరిపిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

- సమీక్ష నివేదిక సీఎం చేతికిస్తాం
విధాత : కాళేశ్వరం ప్రాజెక్టుకు అవకతవకలపై జ్యూడిషియల్ విచారణ జరిపిస్తామని, మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన, సమీక్ష నివేదికను సీఎం రేవంత్‌రెడ్డికి అందిస్తామని, అనంతరం ప్రాజెక్టు మనుగడపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ వద్ధ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభించి మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో మహారాష్ట్రంలో 3వేల ఎకరాల మేరకు తక్కువ ముంపుతో 38 వేల కోట్లతో 16లక్షల ఎకరాలకు సాగునీటి లక్ష్యంగా చేపట్టిన ప్రాణహిత చేవేళ్లను మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆకస్మాత్తుగా రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును 80,000 కోట్లతో మొదలుపెట్టారని, దీంతో ప్రజాధనం వృధా కావడంతో పాటు నష్టం కూడా జరిగిందన్నారు. మేడిగడ్డ పిల్లర్లు ఐదు ఫీట్ల లోతుకు కుంగిపోయాయని, పిల్లర్లు కుంగడంపై అప్పటి సీఎం కేసీఆర్ నోరు మెదుపలేదన్నారు.
కాగ్ కూడా కాళేశ్వరంపై తీవ్ర విమర్శలు చేసిందని, ఇప్పటి వరకు ఖర్చయింది 95 వేల కోట్లుకాగా, ప్రాజెక్టు కింద కొత్తగా లక్ష ఎకరాలు మాత్రమే స్థిరీకరించినట్లుగా అధికారులు చెబుతున్నారని, ప్రాజెక్టు నిర్మాణ ఖర్చుకు తెచ్చిన నిధులకు రీపేమెంట్ ప్రతినెల 13 వేల కోట్లుగా ఉందని, దీనికి ప్రాజెక్టు నిర్వాహణ, విద్యుత్తు బిల్లులు అదనమన్నారు. సమీక్ష తర్వాతా ప్రాజెక్టుపై మునుముందు ఏం చేయాలన్నదానిపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయిస్తారన్నారు.