హామీల అమలులో ప్రభుత్వం ముందుకే.. హుజూర్ నగర్ అభివృద్ధి వేగవంతం

హామీల అమలులో ప్రభుత్వం అన్ని అడ్డంకులను అధిగమిస్తు ముందుకెలుతుందని, ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు

హామీల అమలులో ప్రభుత్వం ముందుకే.. హుజూర్ నగర్ అభివృద్ధి వేగవంతం

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

బీఆరెస్ దోపిడిని కొద్ది రోజుల్లో బయటపెడుతాం : మంత్రి పొంగులేటి

ప్రజా ప్రభుత్వంలో అందరికి న్యాయం : స్పీకర్ ప్రసాద్‌

విధాత : హామీల అమలులో ప్రభుత్వం అన్ని అడ్డంకులను అధిగమిస్తు ముందుకెలుతుందని, ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌, ఎమ్మెల్యే పద్మావతిలతో కలిసి తన హుజూర్‌నగర్ నియోజకవర్గంలో సీతారామచంద్రస్వామి గుడి గుట్ట వద్ద 74కోట్లతో చేపట్టిన 2,160 ఇందిరమ్మ ఇండ్ల పునర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. పాలకవీడు మండలం బెట్టెతండాలో గిరిజన రైతుల కోసం 33కోట్లతో 2వేల ఎకరాలకు సాగునీరందించేందుకు చేపట్టిన నూతన ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ హూజర్‌నగర్‌లో హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేయాలని భావించి, దేవాలయ భూములు కొనుగోలు చేసి హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేశానని, 2009 లో నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 2160 ఇండ్లను 80 శాతం పూర్తి చేశానని, 2014లో ఓటమితో పనులు ఆగిపోయాయని, బీఆరెస్ ప్రభుత్వం గత 10ఏండ్లుగా వాటిని పడావు పెట్టిందని విమర్శించారు. ఇప్పుడు 74 కోట్ల రూపాయలు తో ఇండ్లు పునః నిర్మాణం చేపట్టామని, ఇందుకు సీఎం రేవంత్ రెడ్డికి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటికి ధన్యవాదలు చెబుతున్నానన్నారు. మరో 6 నెలలో ఇండ్లు లేని వారికి హుజుర్ నగర్ లో ప్రతి ఒక్కరికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీ మేరకు గ్యారంటీ పథకాలు అమలు చేశామని, ప్రతి నియోజకవర్గంకి 3500 ఇండ్లు మంజూరు చేశామని, త్వరలో రేషన్ కార్డ్ లేని వారికి రేషన్ కార్డులు మంజూరీ చేశామన్నారు. మీ ఆశీస్సులతో 7 సార్లు గెలిచానని, హుజుర్ నగర్ పట్టణమును ఆదర్శ పట్టణముగా తీర్చు దిద్దుతానన్నారు. కోదాడ, హుజుర్ నగర్‌లలో ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ మంజూరు చేయిస్తానని, 100 పడకల ఆసుపత్రులు మంజూరీ చేయించామన్నారు. హుజుర్ నగర్ అభివృద్ధి జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందేనన్నారు.

పదేళ్లుగా తెలంగాణ ఆస్తులను దోచుకున్నారు : మంత్రి పొంగులేటి

బీఆరెస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల ఆస్తులను దోచుకున్నారని, గత 10 సంవత్సరాలో బీఆరెస్ కనీసం లక్షా ఇండ్లు మంజూరు చేయలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. యాదాద్రి,భద్రాద్రి పవర్ ప్లాంట్ పేర్లు చెప్పుకొని దోచుకున్నారని, ధరణి పేరుతో దోచుకున్న సొమ్మును మరి కొద్ది రోజుల్లో బయట పెడతామని తెలిపారు. మేము పరిపాలకులం కాదు,మేము సేవకులమని, మనది ప్రజాప్రభుత్వమని, ఇందిరమ్మ పాలన అందిస్తుందని చెప్పారు. 70 రోజుల్లోనే, ఉచిత కరెంట్, మహిళలకు 500 గ్యాస్ అమలు చేశామని, సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారని, ప్రతి సంవత్సరం రాష్ట్రములో 4,50,000 ఇండ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రతి గ్రామంలో కమిటీ వేసి ప్రతి పేదవాడికి ఇండ్లు మంజూరు చేస్తామని, పార్టీలకు అతీతంగా ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. హుజూర్‌నగర్‌లో 2160 ఇండ్లకు 74.80 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, మొదటి నాలుగు రోజుల్లో నిధులు విడుదల చేస్తామని, రాబోయే 6 నెలలో ఇండ్లు పూర్తి చేసి ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యగాలు అందిస్తామని, త్వరలో తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటను అమలు చేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడక ముందే వర్షాలు పడక కరువు వచ్చిందని, గత ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్లనే నీళ్లు ఇవ్వలేక పోయామని, కానీ ఇప్పుడు మా మీద తప్పు మోపుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకి అన్యాయం చేశారని, ఇక్కడి పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు.

ప్రజా ప్రభుత్వంలో మీ అందరికి న్యాయం : స్పీకర్ గడ్డం ప్రసాద్

రాష్ట్రంలో ప్రజలు తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన సాగుతుందని మీ అందరికి న్యాయం లభిస్తుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. దళితుడైన తనను స్పీకర్‌గా చేసి సోనియాగాంధీ విపక్షం నోరు మూయించారన్నారు. గత ప్రభుత్వాలు అప్పులు చేసి పోగా, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణతో ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా అమలు చేస్తుందన్నారు. నేను కూడా మాస్ లీడర్‌నని, అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. కోదాడ,హుజుర్ నగర్ ప్రజలు చాలా అదృష్ట వంతులని, ఉత్తమ్ దంపతులకు పిల్లలు లేకున్నా మీరే వారి కుటుంబ సభ్యులనుకుని మీ కోసం నిరంతరం కష్ట పడుతున్నారని, వారికి ఎల్లవేళల అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్‌. వెంకట్రావు సహా జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.