Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల ప్రయాణం మిస్ ఇండియాతో షురూ!

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల ప్రయాణం మిస్ ఇండియాతో షురూ!

Miss World 2025: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 72వ మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల ప్రచారం ‘ఫెమినా మిస్ ఇండియా 2023’ విజేత నందిని గుప్తాతో మొదలైందని ఐఏఎస్, రాష్ట్ర టూరిజం శాఖ సెక్రటరి స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తెలంగాణ జరూర్ ఆనా.. చాల ప్రత్యేకమైన మిస్ ఇండియా నందిని గుప్తాతో మిస్ వరల్డ్ ప్రచారం ప్రారంభమైందని స్మితా సబర్వాల్ తెలిపారు. ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఆమె సిద్ధంగా ఉన్నందున మేము ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.


తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులను, పర్యాటకులను మరింతగా ఆకర్షించే లక్ష్యంతో ఈ అంతర్జాతీయ స్థాయి అందాల పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే ఈ పోటీలలో సుమారు 140 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. పోటీలలో భాగంగా వివిధ కార్యక్రమాలను తెలంగాణలోని చారిత్రక, పర్యాటక ప్రాముఖ్యత కలిగిన 10 ప్రాంతాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ప్రారంభ, ముగింపు వేడుకలను హైదరాబాద్ మహానగరంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ భారీ కార్యక్రమం ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ఆకర్షణలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.