సొంత గూటికి ఆళ్ల.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరారు

విధాత, హైదరాబాద్: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరారారు.. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ఆర్కేను పార్టీలోకి ఆహ్వానించారు. ఆళ్ల తిరిగి వైసీపీలో చేరడంతో మంగళగిరి వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. గత డిసెంబర్‌లో వ్యక్తిగత కారణాల పేరిట వైసీపీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. అయితే ఆ సమయంలో ఆయన రాజీనామాపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇంతలో ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నెల వ్యవధి కాకముందే తిరిగి సొంత గూటికి చేరాలని ఆయన నిర్ణయించుకోవడం విశేషం. వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు చేరుకున్న ఆర్కే.. సీఎం జగన్ ను కలిసి పార్టీలో చేరారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జీగా గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం నియమించింది. తిరిగి పార్టీలో చేరిన ఆళ్లకు మంగళగిరి నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలతో పాటు పొన్నూరు నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక, గెలుపు బాధ్యతలను, గుంటూరు ఎంపీ సీట్ల గెలుపు బాధ్యతలను జగన్ అప్పగించనున్నారని సమాచారం.