వడ్ల బోనస్.. రైతు భరోసా సహాయం ఎప్పుడిస్తారు: హరీశ్‌రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన విధంగా రైతుల ధాన్యం క్వింటాల్‌కు 500 బోనస్ కోసం రైతులు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు

  • By: Somu    latest    Dec 09, 2023 10:51 AM IST
వడ్ల బోనస్.. రైతు భరోసా సహాయం ఎప్పుడిస్తారు: హరీశ్‌రావు

విధాత: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన విధంగా రైతుల ధాన్యం క్వింటాల్‌కు 500 బోనస్ కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, బోనస్ ఎప్పుడిస్తారో చెప్పాలని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శ చేయాలని కాదని, రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుందని, కల్లాల్లో వడ్లు ఉన్నాయని, వాటి కొనుగోలు ఎఫ్పుడు చేస్తారు.. బోనస్ ఎప్పుడిస్తారోనని రైతులు కళ్లళ్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారన్నారు.


క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి, ఎప్పటినుంచి వడ్లు కొంటారో ప్రభుత్వం స్పష్టం చేయాలని, రైతుల పక్షాన ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నామన్నారు. తుఫాన్ కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిశాయని వాటి కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న రైతుబంధు స్థానంలో రైతుభరోసా పేరుతో ఎకరాకు 15వేలు ఇస్తామని చెప్పారని, ఎప్పుడు రైతుబంధు వేస్తారో చెప్పాలని అడుగుతున్నామన్నారు.