185 మంది రైతుల ఆత్మహత్యలు.. 20లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెలకొన్న సాగునీటి కొరత నేపథ్యంలో 20లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోగా, కష్టనష్టాలకు గురైన 185మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు

రజాకార్లలా బ్యాంకు అధికారులు
రైతులను పరామర్శించే టైం లేదా?
మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు
విధాత : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెలకొన్న సాగునీటి కొరత నేపథ్యంలో 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోగా, కష్టనష్టాలకు గురైన 185 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి, బీఆరెస్ ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని రైతులే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. సాగునీరు లేదు.. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని, ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోతూ రైతులు మరింత నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందన్నారు. ఎండిన పంటలకు తోడు పండిన కొద్దిపాట పంటలు అకాల వర్షాలతో దెబ్బతినగా, మిగతా పంటకు మద్దతు ధర మేరకు కొనుగోలు జరుగని పరిస్థితి నెలకొందని చెప్పారు.
‘రైతులు కష్టాల్లో ఉంటే బ్యాంకుల వాళ్ళు అప్పుల గురించి నోటీసులు ఇస్తున్నారు. అప్పులు చెల్లించాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. బకాయిలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు. రజాకార్లను తలపించేలా ప్రవర్తిస్తున్నారు’ అని హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్ర రైతాంగం ఇంత దారుణ స్థితిలో ఉంటే సీఎం రేవంత్‌రెడ్డికి పట్టడం లేదని, ఇతర పార్టీల నుంచి చేరికలపై తప్ప రైతుల గురించి ఆయనకు ఆలోచన లేదని విమర్శించారు. రైతులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు వేసినా నీళ్లు పడటం లేదని చెప్పారు. సీఎంకు, మంత్రులకు రైతులను పరామర్శించి, భరోసా కల్పించే టైం కూడా లేదా అని ప్రశ్నించారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం రుణమాఫీపైనే పెడతానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100రోజులు పూర్తయినా దీనిపై నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు.
రైతులకు ఇచ్చిన 4 హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. రైతులకు భరోసా కల్పించేందుకు, వారి సమస్యలపై పోరాడేందుకు బీఆరెస్ శ్రేణులు రైతుల పొలాల వద్దకు వెళ్లి వారికి సంఘీభావం తెలుపాలని సూచిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు భరోసానిచ్చేలా రైతులను ఆదుకునేందుకు తక్షణమే సమీక్ష నిర్వహించి సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే 2లక్షల రుణమాఫీ చేపట్టాలని, నిర్బంధ రుణ వసూళ్లను ఆపాలని, రైతుబంధు డబ్బులు వెంటనే రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు.