గత పదేళ్లలో కేంద్ర నిధుల లెక్కలు వెల్లడించాలి
గత పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల లెక్కను సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు

- సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ వినతి
విధాత : గత పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల లెక్కను సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయట పెట్టాలని రేవంత్ రెడ్డిని అభ్యర్థిస్తున్నట్లుగా తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో..ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందనేది చూసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ తన ప్రసంగంలో ప్రధాని మోడిని పెద్దన్న అని సంబోధించి రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని అడగడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే గత బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మొదట్లో కేసీఆర్ కూడా మోడిని పొగడ్తలతో ముంచెత్తారని, ఆ తర్వాత కేసీఆర్ మారిపోయి కనీసం మోడీ టూర్స్ లో ప్రోటోకాల్ కూడా పాటించలేదని విమర్శించారు. కేసీఆర్ లాగా సీఎం రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా మారొద్దని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు పెట్టుకుంటే రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.