MLC Kavitha | కవిత కేసు విచారణ 28కి వాయిదా
ఢిల్లీ లిక్కర్ కేసులోఈడీ విచారణ పద్దతిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది

MLC Kavitha | విధాత : ఢిల్లీ లిక్కర్ కేసులోఈడీ విచారణ పద్దతిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈడీ విచారణలో మహిళగా తనకు మినహాయింపులు కావాలంటూ, తనను ఈడీ వారి కార్యాలయానికి పిలిపించి రాత్రి వరకు విచారిస్తున్నారని, తనను ఇంటి వద్దనే విచారించాలని కవిత తన పిటిషన్‌లో కోరారు. కవిత, ఈడీ తరుపుల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 28వ తేదీకి వాయదా వేసింది. ఇప్పటికే కవితకు ఈ కేసులో ఈడీ విచారణకు రావాలని నోటీస్‌లు జారీ చేయగా, ఆమె విచారణకు హాజరుకాలేదు.
ఢిల్లీ మద్యం విధానం కేసు దర్యాప్తులో భాగంగా గత ఏడాది మార్చిలో కవితను ఈడీ అధికారులు ఢిల్లీ కార్యాలయంలో మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈడీ కార్యాలయం వద్ద కాకుండా మహిళను ఇంటి వద్దే విచారించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాకముందే ఈడీ అధికారులు గత సెప్టెంబర్‌లో మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో నవంబరు వరకు కవితను విచారణకు పిలవరాదని కోర్టు ఆదేశించింది.
ఇంతలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు రావడంతో ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ విచారణ వెనక్కు వెళ్లింది. ఇటీవల కవితకు మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చింది. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ముందుగా షెడ్యూల్ అయిన కార్యక్రమాలు ఉన్నందున విచారణకు హాజరయ్యే పరిస్థితి లేదని అధికారులకు ఈ-మెయిల్‌లో కవిత సమాచారం ఇచ్చారు. విచారణకు హాజరు కాలేనన్న కవిత సమాధానంపై ఈడీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.