పేదలకు పథకాలు ఇవ్వకుంటే ఉద్యమిస్తాం
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలు 100 రోజుల్లో అమలు చేయకుంటే ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు

- కాంగ్రెస్ 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేయాలి
- పేదల కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తెచ్చి ఇచ్చారు
- ఓటమితో కుంగిపోం.. ప్రజల తరపున పోరాడుతాం
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదాకు కృషి చేయాలి
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలు 100 రోజుల్లో అమలు చేయకుంటే ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అమలుకు సాధ్యం కాని పథకాల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్.. వాటిని అమలు చేయడంలో మీనమేషాలు వేస్తున్నదని విమర్శించారు. పాలమూరు జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
2009లో కేసీఆర్ పాలమూరు పార్లమెంట్ స్థానంలో పోటీ చేసినప్పటి నుంచి జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఇక్కడ ఎంపీగా గెలుపొందిన కేసీఆర్ తెలంగాణ సాధించడం చారిత్రక ఘట్టమని, అందుకే ఈ జిల్లావాసులకు కేసీఆర్ ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. తెలంగాణ రాష్ట్రo ఏర్పాటుకు ముందు పల్లె పల్లేన పల్లేర్లు మొలిసే పాలమురులోన.. అని పాడుకున్న ఈ నేల.. ఇప్పుడు పసిడి సిరులు పండించే స్థాయికి చేరుకుందని కవిత అన్నారు. మేం ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చామని, ఓటమికి భయపడే స్వభావం కాదన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కేసీఆర్ హయాంలో చాలావరకు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టు పనులు ఇంకా 10 శాతం పూర్తి కావాల్సిఉందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అవుతే జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని కవిత పేర్కొన్నారు. పూర్తి కాబోతున్న ఈ ప్రాజెక్టు డిజైన్ మారుస్తామని రేవంత్ సర్కార్ అంటుందని, ఇలాంటి ప్రయత్నాలు మానుకుని రేవంత్ రెడ్డి కృషి చేసి ఈ ప్రాజెక్టుకు రావాల్సిన జాతీయ హోదా కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్ ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారో ప్రజలకు వివరించాలని కవిత డిమాండ్ చేశారు.
డిసెంబర్ 9న ప్రమాణం చేసిన వెంటనే కాంగ్రెస్ ప్రకటించిన పథకాలు అమలుచేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. రైతుబంధు, పింఛన్లు, రుణమాఫీ వంటివి నేటికీ విడుదల చేయలేదన్నారు. కేసీఆర్ హయాంలో 44 లక్షల మందికి పింఛన్లు ఇచ్చామని, వారికి పెంచిన పింఛన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. 200 యూనిట్లలోపు కరెంటు బిల్లులు వచ్చే వారు ఎవ్వరూ బిల్లులు చెల్లించవద్దన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కొని మున్సిపాలిటీలు, జడ్పీ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టాలని చూస్తున్నారని, మీకు అవసరం అనుకుంటే ప్రతినిధులను మేమే పంపిస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలను కోరారు. అంతకుముందు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోదరుడు శశి వర్ధన్ రెడ్డి ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని అన్నాసాగర్ గ్రామంలో కవిత పరామర్శించారు. ఆమె వెంట ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.