Manipur | మణిపూర్‌పై నిమిషమే.. హింసపై మాట్లాడేందుకు ప్రధాని అయిష్టత
Manipur శాంతి మళ్లీ నెలకొంటుందని పొడి వ్యాఖ్యలు లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీరిది ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబివ్వని మోదీ ప్రతిగా ప్రతిపక్షాలపై ఎదురు దాడి గొప్పతనం చాటుకునేందుకు ప్రయత్నం 2024లో మళ్లీ తమదే గెలుపని జోస్యం మోదీ ఎన్నికల సభగా సమాధానం సభ నుంచి వాకౌట్ చేసిన ప్రతిపక్ష పార్టీలు న్యూఢిల్లీ: ఏ ప్రశ్నకూ సమాధానం లేదు.. ఏ విమర్శకూ స్పందన లేదు. చర్చలో ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలూ ప్రస్తావనకు రాలేదు. ప్రధాని మోదీ తన సహజ […]

Manipur
- శాంతి మళ్లీ నెలకొంటుందని పొడి వ్యాఖ్యలు
- లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీరిది
- ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబివ్వని మోదీ
- ప్రతిగా ప్రతిపక్షాలపై ఎదురు దాడి
- గొప్పతనం చాటుకునేందుకు ప్రయత్నం
- 2024లో మళ్లీ తమదే గెలుపని జోస్యం
- మోదీ ఎన్నికల సభగా సమాధానం
- సభ నుంచి వాకౌట్ చేసిన ప్రతిపక్ష పార్టీలు
న్యూఢిల్లీ: ఏ ప్రశ్నకూ సమాధానం లేదు.. ఏ విమర్శకూ స్పందన లేదు. చర్చలో ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలూ ప్రస్తావనకు రాలేదు. ప్రధాని మోదీ తన సహజ శైలిలో అసలు విషయాలు వదిలేసి.. కొసరు విషయాలు, ప్రశ్నించిన పక్షాలపై దాడి ప్రధాన అంశంగా ఉపన్యాసం ఊదరగొట్టారు. మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని, అందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామన్న మోదీ.. నిర్దిష్టంగా మాత్రం ఏమీ చెప్పకుండా దాటవేశారు.
చివరకు ప్రతిపక్షాల వాకౌట్ మధ్య అవిశ్వాసం మూజువాణి ఓటుతో వీగిపోయింది. మణిపూర్ అంశంపై ప్రధాని సభలో ప్రకటన చేయాలని, దానిపై సమగ్రంగా చర్చ జరగాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. అయితే.. పార్లమెంటులో ప్రకటన చేసేందుకు మోదీ సిద్ధపడలేదు. దీంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితేనైనా మోదీ సభకు వస్తారని భావించిన ప్రతిపక్షం.. ఆ మేరకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. అయితే.. తప్పని పరిస్థితుల్లో సభకు వచ్చిన మోదీ.. ఈ ప్రసంగాన్ని తన ఎన్నికల ప్రసంగంగా మార్చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
మణిపూర్ విషయంలో మోదీతో మాట్లాడించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించినప్పటికీ.. తాను మాత్రం నోరు విప్పేదేలే అన్నట్టు ఇతర అంశాలు మాట్లాడుకుంటూ పోయారు. మణిపూర్ అంశంపై ఒకే ఒక్క నిమిషంలో తేల్చేశారు. తన గొప్పతనాన్ని చాటుకునేందుకే ప్రసంగం మొత్తాన్నీ వాడుకున్నారు. దీంతో ప్రతిపక్షాలు.. ప్రధాని ప్రసంగాన్ని బహిష్కరిస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రతిపక్షాలు సభ నుంచి వెళ్లిపోయిన తర్వాత మిగిలిన అధికార పక్ష సభ్యులు.. ఎన్డీఏకు దగ్గరయ్యేందుకు తహతహలాడుతున్న పార్టీల సభ్యులను ఉద్దేశించి మోదీ ప్రసంగాన్ని హోరెత్తించారు.
రాబోయే 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అఖండ విజయం సాధిస్తాయని చెప్పుకొన్నారు. ఈ విషయంలో అన్ని రికార్డులనూ బద్దలు కొడతామన్నారు. 2018లోనూ తన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయని గుర్తు చేసిన ప్రధాని.. ఇప్పుడు ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టడం తమకు శుభసూచకమని చెప్పారు.
లోక్‌సభలో మూడు రోజులుగా సాగిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రధాని చివరి రోజు గురువారం సమాధానం చెబుతూ.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ అభివృద్ధికి ఉద్దేశించిన అనేక బిల్లులపై పార్లమెంటులో చర్చకు ప్రతిపక్షాలు అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. వాళ్లకు దేశం కంటే పార్టీయే పెద్దదని నిరూపించారని అన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు.
మణిపూర్‌లో శాంతి నెలకొంటుంది
మణిపూర్ గురించి మాట్లాడుతూ.. ఆ రాష్ట్రంలో శాంతి పునరద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. ‘మణిపూర్‌లో మళ్లీ శాంతి నెలకొంటుంది. మణిపూర్ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. ఆ రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తుంది. అందుకోసం అన్ని ప్రయత్నాలూ చేస్తాం’ అని ఆయన చెప్పారు. భారత మాత గురించి సభలో చేసిన వ్యాఖ్యలు యావత్ దేశ మనోభావాలను దెబ్బతీశాయని మోదీ అన్నారు.
భారత మాత చావు గురించి కొందరు మాట్లాడారన్న ప్రధాని.. ఇంతకంటే దురదృష్టం ఏమీ ఉండదని చెప్పారు. 2018లో ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినప్పుడు 2019లో భారీ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చామన్న మోదీ.. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం తమ ప్రభుత్వానికి శుభసూచకమని వ్యాఖ్యానించారు. ఈ దేశ ప్రజలు తమ ప్రభుత్వంపై ఎప్పుడూ విశ్వాసం ఉంచుతున్నారంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
2028లో మరో అవిశ్వాస తీర్మానం తెస్తే.. భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని దేశం విశ్వసిస్తున్నదని చెప్పారు. తన పాలన గొప్పతనం వల్లే కుంభకోణాల్లేని పరిపాలన కొనసాగుతున్నదని చెప్పుకొన్నారు. కొత్త ఉత్సాహం, విశ్వాసం దేశ ప్రజల్లో నిండి ఉన్న సమయంలో ప్రతిపక్షాలు ఉష్ట్రపక్షిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్షాలకు రహస్య వరం ఉన్నదన్న ప్రధాని.. ప్రతిపక్షాలు ఎవరి నాశనాన్నయినా కోరుకుంటే.. వారు అద్భుతంగా పురోగతి సాధిస్తారని ఎద్దేవా చేశారు. అందుకు తానే ఉదాహరణ అన్న మోదీ.. తనను 20 ఏళ్లుగా టార్గెట్ చేశారని, కానీ.. తనకేమీ జరుగలేదని చెప్పారు. ప్రతిపక్షాలు బ్యాంకింగ్ సెక్టార్, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఎల్‌ఐసీ వంటి వాటిని టర్గెట్ చేసినా.. అవి రికార్డుస్థాయి లాభాల్లో నడుస్తున్నాయని అన్నారు.
ఇప్పుడు ప్రతిపక్షాలు దేశాన్ని తిడుతుంటే.. దేశం మరింత బలోపేతమవుతున్నదని చెప్పారు. తమ ప్రభుత్వం కూడా మరింత శక్తిమంతంగా తయారవుతుందని అన్నారు. తమ ప్రభుత్వ మూడో హయాంలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని జోస్యం చెప్పారు. దేశం ఇప్పుడు కీలక దశలో ఉన్నదన్న మోదీ.. దాని ప్రభావం వచ్చే వెయ్యేళ్లు ఉంటుందని అన్నారు.
ఐఎన్‌డీఐఏపై మోదీ చతుర్లు
ప్రతిపక్షాల ఐ.ఎన్.డీ.ఐ.ఏ. కూటమిపై మోదీ విమర్శలు గుప్పించారు. పాత వాహనానికి రంగులేసి ఎలక్ట్రిక్ వాహనంగా చెప్పుకొంటున్నారని అన్నారు. ఐ.ఎన్.డీ.ఐ.ఏ. కూటమికి కూడా ఎన్.డీ.ఏ కావాలని మోదీ అన్నారు. ఐ అనే అక్షరం లేకుండా ఇండియా కూటమి లేదని చెప్పారు. దేశం పేరు వాడుకోవడం ద్వారా తన విశ్వసనీయతను పెంచుకోవాలని యూపీఏ భావించి ఉండొచ్చని అన్నారు.
ఎన్నికల చిహ్నం మొదలుకుని.. సిద్ధాంతాల వరకూ ఏదీ కాంగ్రెస్ సొంతం కాదని చెప్పారు. అన్నీ ఇతరుల నుంచి అప్పు తెచ్చుకున్నవేనని ఎద్దేవా చేశారు. త్రివర్ణ పతాకాన్ని పార్టీ జెండాగా పెట్టుకున్నారని, ఆఖరుకు గాంధీ అనే ఇంటిపేరును సైతం కొట్టేశారని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిలో ప్రతి ఒక్కరూ ప్రధాని కావాలని అనుకునేవారేనని విమర్శించారు.
గంట ప్రసంగంలోనూ మణిపూర్ ముచ్చటే లేదు
ప్రధాని మోదీ లోక్‌సభలో గంట సేపు ఉపన్యసించినా.. మణిపూర్ గురించి కేవలం నిమిషం మాత్రమే మాట్లాడారని ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. తన గొప్పతనం చాటుకోవడానికే సమయం సరిపోయిందని ఎద్దేవా చేసింది. సొంత డబ్బా కొట్టుకోవడంతోపాటు.. ప్రతిపక్షాలపై విసుర్లు, పెద్ద పెద్ద మాటలతో సరిపెట్టారని ఎక్స్‌లో విమర్శించింది.
అదే సమయంలో మణిపూర్ విషయంలో తన అజ్ఞానాన్ని, నిష్క్రియాపరత్వాన్ని చాటుకున్నారని ఎద్దేవా చేసింది. ‘మణిపూర్ కోసం నిమిషం. స్వోత్కర్షకోసం గంటలు. ప్రధాని మోదీజీ.. మీ అజ్ఞానం, నిష్క్రియాపరత్వం వల్ల మణిపూర్ ఇంకెంత కాలం బాధపడాలి?’ అని ప్రశ్నించింది