జై శ్రీరాం మంత్రం జపిస్తూ.. ఆకలితో చావమంటున్న మోదీ!

దేశంలో ఒకవైపు ఆకలి చావులు పెరిగిపోతుంటే.. ప్రధాని మోదీ మాత్రం జై శ్రీరాం మంత్రం జపించాలని కోరుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ విమర్శించారు

  • Publish Date - March 5, 2024 / 11:53 AM IST
  • దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నా పట్టని ప్రధాని
  • నిప్పులు చెరిగిన కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ

సారంగపూర్‌: దేశంలో ఒకవైపు ఆకలి చావులు పెరిగిపోతుంటే.. ప్రధాని మోదీ మాత్రం జై శ్రీరాం మంత్రం జపించాలని కోరుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని సారంగపూర్‌లో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. దేశ ప్రజలు జై శ్రీరాం అనుకుంటూ ఆకలితో చావాలని మోదీ కోరుకుంటున్నారని మండిపడ్డారు. రాహుల్‌ యాత్ర వద్దకు వచ్చిన కొందరు బీజేపీ కార్యకర్తలు.. మోదీ మోదీ అని అరుస్తూ జై శ్రీరాం అని నినాదాలు చేశారు. వారి నినాదాలను విన్న రాహుల్‌.. ప్రధాని దేశ నిరుద్యోగ యువత రోజంతా ఫోన్లలో రీల్స్‌ చూసుకుంటూ.. జై శ్రీరాం అని నినాదాలు చేస్తూ ఆకలితో చచ్చిపోవాలని కోరుకుంటున్నారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ అగ్నివీర్‌ పథకాన్ని ప్రస్తావించిన రాహుల్‌.. గతంలో సాయుధ బలగాలకు పెన్షన్లు ఇచ్చేవారని, బలిదానం చేస్తే వారికి గౌరవం లభించేదని చెప్పారు. ‘ఇప్పుడు అగ్నివీర్‌ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని ప్రకారం.. నలుగురిని చేర్చకుంటే.. అందులో ముగ్గురిని రిలీవ్‌ చేస్తారు. ఆ ముగ్గురు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారే ఉంటారు’ అన్నారు. నిరుద్యోగం విషయంలో ప్రధానిపై రాహుల్‌ గత మూడు రోజులుగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. పాకిస్థాన్‌ కంటే భారతదేశంలో నిరుద్యోగిత ఎక్కువ ఉన్నదని ఆదివారం గ్వాలియర్‌లో నిర్వహించిన సమావేశంలో కూడా చెప్పారు. పాకిస్థాన్‌లో 12శాతం నిరుద్యోగితి ఉంటే.. భారతదేశంలో అది 23 శాతంగా ఉన్నదని పేర్కొన్నారు. భారత్‌లో 40 ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగిత చేరిందని చెప్పారు.