లొంగిపోవడానికి మరికొంత గడువు ఇవ్వండి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకున్నది

- సరెండర్‌కు మూడు రోజుల ముందు సుప్రీంకోర్టుకు
- పిటిషన్ వేసిన బిల్కిస్ బానో కేసు ముగ్గురు దోషులు
- నేడు విచారణకు రానున్న దోషుల పిటిషన్
విధాత: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసులో జైలులో లొంగిపోవడానికి మూడు రోజుల ముందు ముగ్గురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జైలు అధికారుల ఎదుట లొంగిపోవడానికి మరికొంత గడువు ఇవ్వాలని కోరారు. కుటుంబ వివాహాలు, తల్లిదండ్రుల ఆరోగ్యం ఇతర కారణాలను చూపారు. వారి పిటిషన్లను జాబితా చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. వారి పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నది.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె మూడేండ్ల కుమార్తెతో సహా ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేసిన 11 మంది వ్యక్తులకు క్షమాపణలు ఇవ్వాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు జనవరి 8న ఒక చరిత్రాత్మక తీర్పులో రద్దు చేసింది. 2022లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదలైన 11 మంది దోషులు జనవరి 22లోగా లొంగిపోవాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ముగ్గురు దోషులు లొంగిపోవడానికి మూడు రోజుల సమయం మాత్రమే ఉన్నదని, ముందస్తు విచారణ కోరుతూ సీనియర్ న్యాయవాది వీ చితంబరేశ్ పిటిషన్ దాఖలు చేశారు. వీటి పిటిషన్లు శుక్రవారం విచారణకు రానున్నాయి. దోషి గోవింద్‌భాయ్ నాయ్ మరో నాలుగు వారాలు, రమేశ్ చందనా, మితేష్ భట్ తమను తాము హాజరు కావడానికి మరో ఆరు వారాల గడువు కోరారు.
బార్బర్‌గా పనిచేస్తున్న గోవింద్‌భాయ్ నాయ్ తన 88 ఏండ్ల మంచాన పడ్డ తన తండ్రి, 75 ఏండ్ల తల్లిని పూర్తిగా సంరక్షిస్తున్నానని, వారు పూర్తిగా తనపై ఆధారపడి ఉన్నారని సుప్రీంకోర్టుకు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన ఇద్దరు పిల్లల ఆర్థిక అవసరాలకు కూడా తానే బాధ్యత వహిస్తానని చెప్పారు. 55 ఏండ్ల తనకు ఆస్తమా ఉన్నదని, ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నానని చెప్పాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత తాను ఎలాంటి చట్టాన్ని ఉల్లంఘించలేదని, విడుదల ఆర్డర్‌లోని నిబంధనలు, షరతులకు కట్టుబడి ఉన్నానని కూడా పేర్కొన్నారు.
తన కుమారుడి పెళ్లికి సమయం కావాలని రమేశ్ చందన సుప్రీంకోర్టుకు నివేదించగా, మితేశ్ భట్ పంట సీజన్‌ను ఉదహరించారు. ఈ కేసులో ఈ నెల 8న జస్వంత్ నాయ్, గోవింద్‌భాయ్ నాయ్, శైలేశ్ భట్, రాధేశం షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్‌భాయ్ వోహానియా, ప్రదీప్ మోర్ధియా, బకాభాయ్ వోహానియా, రాజుభాయ్ సోనీ, మితేష్ భట్, రమేశ్ చందనా అనే దోషులు విడుదలైన సంగతి తెలిసిందే.