రేవంత్ పాదయాత్ర.. దిగొస్తున్న సీనియర్లు
రేవంత్‌ను వ్యతిరేకించే నేతలంతా సైలెంట్ తామూ పాదయాత్ర చేస్తామంటున్న నేతలు మీ కార్యక్రమాలు మీరు చేయండి.. రేవంత్ జోలికెళ్లకండి సీనియర్లను సున్నితంగా హెచ్చరించిన ఠాక్రే రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో నేతలంతా క్రమంగా రేవంత్ యాత్రకు సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా తనను విమర్శించే నేతలను ఒక్క మాట కూడా అనకుండా ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టారు. విధాత: రేవంత్ పాదయాత్రతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చింది. […]

- రేవంత్‌ను వ్యతిరేకించే నేతలంతా సైలెంట్
- తామూ పాదయాత్ర చేస్తామంటున్న నేతలు
- మీ కార్యక్రమాలు మీరు చేయండి.. రేవంత్ జోలికెళ్లకండి
- సీనియర్లను సున్నితంగా హెచ్చరించిన ఠాక్రే
రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో నేతలంతా క్రమంగా రేవంత్ యాత్రకు సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా తనను విమర్శించే నేతలను ఒక్క మాట కూడా అనకుండా ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టారు.
విధాత: రేవంత్ పాదయాత్రతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చింది. ఇప్పటి వరకు అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన సీనియర్ నేతలంతా తామెక్కడ వెనుకబడి పోతామోనన్న భయంతో ఉన్నారు. దానితో ఎవరికి వారు తాము సైతం పాదయాత్రలు చేస్తామని ముందుకు వస్తున్నారు.
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ అయిన సీనియర్ నేతలంతా ఇదే విషయాన్ని చెబుతున్నట్లు సమాచారం. అలాగే రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రలో తాము కూడా పాల్గొంటామని కూడా ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
ఒక్కొక్కరూ.. సైలెంట్
రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సీరియస్‌గా వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు క్రమంగా ఒకరి తర్వాత ఒకరిగా సైలెంట్ అవుతున్న వాతావరణం కాంగ్రెస్‌లో కనిపిస్తున్నది. మాణిక్ రావు ఠాక్రే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో రేవంత్‌కు వ్యతిరేకంగా అసమ్మతి గళం విప్పిన నేతలకు చెక్ పెట్టారు.. ‘ముందుగా మీరంతా కలిసి పార్టీని అధికారంలోకి తీసుకురండి.. ఆ తరువాత మిగతా విషయాలు చూసుకుందాం’ అని విస్పష్టంగా తేల్చి చెప్పారు.
10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నామని, ఏ విధంగా ప్రజలకు దగ్గరై అధికారంలోకి రావాలో ఆలోచించకుండా ఈ చిల్లర పంచాయతీ ఏమిటని సున్నితంగానే అయినా.. కఠినంగానే హెచ్చరించారు. దాంతో నేతలు కూడా వెనక్కి తగ్గారు. ఆ తరువాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర చేపట్టారు. ఐఏసీసీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ యాత్ర ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతున్నది.
ప్రజల స్పందన వల్లే నేతల్లో మార్పు!
రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో నేతలంతా క్రమంగా రేవంత్ యాత్రకు సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా తనను విమర్శించే నేతలను ఒక్క మాట కూడా అనకుండా ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎత్తి చూపుతూ ప్రజలకు భరోసా కల్పించడమే ప్రధాన ఎజెండాగా రేవంత్ తన కార్యక్రమాలను చేపట్టారు.
ఈ కార్య్రక్రమం మంచి ఫలితం ఇస్తుండటంతో సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నేత వీ హన్మంతరావు తదితరులంతా రేవంత్ పాదయాత్రలో పాల్గొన్నారు. మరో సీనియర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి కూడా రేవంత్ పాదయాత్రలో పాల్గొంటానని ప్రకటించారు. పరోక్షంగా రేవంత్‌రెడ్డి తమ జిల్లాకు రావాలని ఆహ్వానించారు కూడా.
అటు జ్ఞానోదయం.. ఇటు కంగారు!
రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కొంతమందికి జ్ఞానోదయం అయినట్లు పార్టీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. ఇదే సమయంలో తామెక్కడ వెనుకబడి పోతామోనన్న భయం కూడా పట్టుకున్నదని చెబుతున్నారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి పేరు నేరుగా చెప్పకుండా ఇప్పటికే నేతలు చేస్తున్న పాదయాత్రల్లో తాము పాల్గొంటామని ప్రకటనలు చేస్తుండడం గమనార్హం.
ఇదే సమయంలో తాము కూడా పాదయాత్రలు చేస్తామని, తమకూ అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ గాంధీ భవన్‌కు గురువారం వచ్చిన ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేను కలిసి అడిగారు. ప్రజల్లో పార్టీని బలోపేతం చేసే క్రమంలో వారికి కూడా ఠాక్రే అనుమతి ఇచ్చినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.