MULUGU: హామీల అమలెక్కడ CM KCR గారు.. ఎన్నికలకే పరిమితమైన మాటలు: సీతక్క
పడకేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పోడు భూమి పట్టాల తీరని గోడు జాడలేని రైతు రుణమాఫీ అమలు అమలుకు నోచుకోని నిరుద్యోగ భృతి అమలుకోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ కు అమలు చేయడం అలవాటు లేదని ములుగు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి […]

- పడకేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
- పోడు భూమి పట్టాల తీరని గోడు
- జాడలేని రైతు రుణమాఫీ అమలు
- అమలుకు నోచుకోని నిరుద్యోగ భృతి
- అమలుకోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం
- ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ కు అమలు చేయడం అలవాటు లేదని ములుగు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క విమర్శించారు.
ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో తొమ్మిదేళ్లుగా ప్రజలను ఊరిస్తుందని విమర్శించారు. స్వంత ఇంటి స్థలం ఉన్న వాళ్లకు ఇంటి నిర్మాణం కోసం బడ్జెట్ లో ప్రకటించినా.. ఈ పథకానికి ఇంకా మార్గదర్శకాలు ఇవ్వలేదని తెలిపారు.
నిరుద్యోగ భృతి ఎక్కడ సీఎం
నిరుద్యోగులకు ఇస్తామన్న రూ. 3016 నిరుద్యోగ భృతి ఏమైందని సీతక్క ధ్వజమెత్తారు. కష్ట పడి చదువుకున్న యువతకు ఉద్యోగాలు రాక ఆత్మ హత్యలు చేసుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. రాక రాక నోటిఫికేషన్లు వేస్తే పేపర్ లీకేజీ చేసి నిరుద్యోగ జీవితాలతో చెలగాటం ఆడుతున్నదన్నారు. ప్రభుత్వం లీకేజీ వెనుక ఉన్న పెద్దలను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పోడు పట్టాల జాడలేదు
పోడు భూముల సమస్య పరిష్కారం కోసం స్వయంగా కుర్చీ వేసుకుని పరిష్కరిస్తానని చెప్పిన ముఖ్యమంత్రికి కుర్చీ దొరకడం లేదా? అని ప్రశ్నించారు. పోడు భూమి సాగులో ఉన్నవారికి కనీసం పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి పట్టాలు ఇస్తే హరితహారం పేరుతో పేదల భూములను ప్రభుత్వం గుంజుకుందన్నారు.
రుణమాఫీ చేయకుండా నిర్లక్ష్యం
రైతు లేనిదే రాజ్యం లేదు, రైతును రాజు చెయ్యడమే ఏకైక లక్ష్యమని ఏక కాలంలో రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేశారని విమర్శించారు. కెసిఆర్ మాయ మాటలను ఇక ప్రజలు నమ్మరన్నారు.
అధికారంలోకి రాగానే అమలు
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఒక్క అవకాశం ప్రజలు ఇవ్వాలని సీతక్క కోరారు.
కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవి చందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి బాగ్ వాన్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.