Muthireddy | వివాదాల ఎమ్మెల్యే.. ముత్తిరెడ్డిపై ఆరోపణల వెల్లువ! జనంలో నిలదీసిన కన్నబిడ్డ

Muthireddy | ఆరంభం నుంచి ఆయన రూటే సపరేటు భూ కబ్జాలు, అవినీతి, బెదిరింపులు జనంలో నిలదీసిన కన్నబిడ్డ ప్రత్యర్థుల కుట్రలంటున్న ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఎప్పుడూ వివాదాలు చుట్టు ముడుతున్నాయి. అదేంటోకానీ కొందరి రాజకీయ ఎదుగుదలకు ఈ వివాదాలే ఒక విధమైన ప్రచారం కల్పిస్తాయి. యాదగిరి రెడ్డి చుట్టూ కూడా వెల్లువెత్తుతున్న ఈ విమర్శలు, ఆరోపణలు ఆయనకు విస్తృత ప్రచారాన్ని మాత్రం కల్పిస్తున్నాయి. […]

Muthireddy | వివాదాల ఎమ్మెల్యే.. ముత్తిరెడ్డిపై ఆరోపణల వెల్లువ! జనంలో నిలదీసిన కన్నబిడ్డ

Muthireddy |

  • ఆరంభం నుంచి ఆయన రూటే సపరేటు
  • భూ కబ్జాలు, అవినీతి, బెదిరింపులు
  • జనంలో నిలదీసిన కన్నబిడ్డ
  • ప్రత్యర్థుల కుట్రలంటున్న ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఎప్పుడూ వివాదాలు చుట్టు ముడుతున్నాయి. అదేంటోకానీ కొందరి రాజకీయ ఎదుగుదలకు ఈ వివాదాలే ఒక విధమైన ప్రచారం కల్పిస్తాయి. యాదగిరి రెడ్డి చుట్టూ కూడా వెల్లువెత్తుతున్న ఈ విమర్శలు, ఆరోపణలు ఆయనకు విస్తృత ప్రచారాన్ని మాత్రం కల్పిస్తున్నాయి. విపక్ష పార్టీలు, స్వపక్షంలోని ప్రత్యర్ధులు, ఆఖరికి సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆయనపై తీవ్ర విమర్శలు రావడం చర్చనీయాంశంగా మారాయి.

ముత్తిరెడ్డి రూటే సపరేటు

ఆరంభం నుంచి ముత్తిరెడ్డి రూటే సపరేటు అన్నట్లుగా సాగుతోంది. భూకబ్జాలు, అవినీతి ఆరోపణలు, ఫోర్జరీలు, బెదిరింపులు, ఆఖరికి హత్యారోపణలు సైతం వస్తున్నాయి. తన నియోజకవర్గ పర్యటనల సందర్భంగా తరచూ నోరు జారడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా ఆయనకు అలవాటుగా మారింది. పదేపదే వివాదాలకు ముత్తిరెడ్డి కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు.

రెండో పర్యాయం జనగామ ఎమ్మెల్యేగా

ఎన్ని విమర్శలూ, ఆరోపణలు వస్తున్నప్పటికీ ముత్తిరెడ్డి రెండో పర్యాయం జనగామ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆఖరికి కన్నబిడ్డ నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కుటుంబ ఆస్తి త‌గ‌దాలు, భూ పంచాయితీలు వ‌రుస‌గా ర‌చ్చ‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే ఉప్ప‌ల్‌లోని ఓ భూమి విష‌యంలో తండ్రి ముత్తిరెడ్డి పైన కన్న కూతురు తుల్జా భవాని కొద్ది రోజుల క్రితం కేసు పెట్టిన విషయం తెలిసిందే. తన పేరు మీద ఉన్న భూమిని ఫోర్జరీ చేసి తమ తండ్రి విక్రయించాడని ఆరోపిస్తూ హైదరాబాదులో కేసు పెట్టారు. అప్పట్లో ఈ అంశం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై ముత్తిరెడ్డి కూడా తీవ్రంగానే ప్రతిస్పందించారు.

ప్రత్యర్థుల కుట్రగా విమర్శించారు. రాజకీయాల్లో వెన్నుపోటు విధానాలు సరైంది కాదని, దమ్ముంటే నేరుగా తనని ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. అందరికీ కుటుంబాలు ఉంటాయని, కుటుంబంలో ఉన్న సమస్యలకు రాజకీయాలు ముడిపెట్టడం సరైనది కాదని హితవు కూడా చెప్పారు. తమ పార్టీలోని కొందరు కావాలని తన బిడ్డను రెచ్చగొడుతున్నట్టు వివరించారు. తర్వాత కొద్ది రోజులు ఈ సమస్య సద్దుమణిగింది. తాజాగా సోమవారం మరోసారి తెరపైకి వచ్చింది.

ఉత్సవాల్లో తండ్రితో బిడ్డ వాగ్వివాదం

దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హరితోత్సవంలో పాల్గొన్న తన తండ్రిని బిడ్డ తుల్జా భవాని అందరి ముందే నిలదీయడం మరోసారి చర్చకు దారి తీసింది. చేర్యాల‌లో ఓ భూమికి సంబంధించిన ప‌త్రాల‌పై త‌న సంత‌కాల‌ను ఫోర్జ‌రీ చేశారంటూ ఆమె ఆరోపించారు. సోమ‌వారం జ‌న‌గామ జిల్లా చీట‌కోడూరులో ప‌ర్య‌టిస్తున్న ఎమ్మెల్యే వ‌ద్ద‌కు చేరుకున్న తుల్జా భ‌వాని అంద‌రి ఎదుటే తండ్రితో వాగ్వాదానికి దిగారు. తాజాగా చేర్యాల‌లోని ఓ భూమికి సంబంధించిన ప‌త్రాల‌పై త‌న సంత‌కాలు ఫోర్జ‌రీ అయ్యాయంటూ ఆరోపించారు. తండ్రీ బిడ్డల వాగ్వాదం ఆసక్తికరంగా సాగింది.

తొలి నుంచి వివాదాస్పదుడే

తొలిసారి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవి చూసిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 2014లో జనగామ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కొద్ది రోజులకే జనగామ పట్టణంలో ఓ కళాశాల భూమిని కబ్జా చేశాడని ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. సాక్షాత్తు కలెక్టరే ఎమ్మెల్యే పై భూకబ్జా ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు.

తర్వాత ఒక కుంటను కూడా కబ్జా చేశాడని ఆరోపణలు వచ్చాయి. జనగామతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. విపక్షాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆఖరికి సొంత పార్టీ నాయకులు ఆయనపై ఆరోపణలు చేయడం గమనించవలసిన అంశం.

తాజాగా జరిగిన మాజీ ఎంపీడీవో రామకృష్ణయ్య హత్య కేసులో కూడా ఎమ్మెల్యే పై బాధిత కుటుంబ సభ్యులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు అధికార పార్టీ ప్రజా ప్రతినిధి భర్త కావడం గమనార్హం. ఈ రక్తపు మరకలను తొలగించుకునేందుకు అధికార గులాబీ పార్టీ హడావిడిగా నిందితుడు గిరిబోయిన అంజయ్య ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఓ ప్రకటన జారీచేసి చేతులు దులుపుకున్నారు. ఈ సంఘటన మరవకముందే కన్నబిడ్డ ముత్తిరెడ్డిని బహిరంగంగా నిలదీయడంతో మరోసారి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేరు రచ్చకెక్కింది.

మూడోసారి పోటీకి ఆసక్తి

మూడోసారి ముచ్చటగా ముత్తిరెడ్డి పోటీకి ఉవ్విళ్ళూరుతుండగా ప్రతిపక్షాలు ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రత్యర్ధులు ఆయనను, ఆయన తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. అదే విధంగా సొంత పార్టీలోని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విపక్షంగా తయారై ఆయన సీటుకి ఎసరు పెడుతున్నారని చర్చ జనగామ కేంద్రంగా సాగుతోంది.

స్వపక్షంలో విపక్షానికి అధినేత ఆశీస్సులు కూడా ఉన్నాయని చర్చ జరుగుతోంది. వివాదాస్పద వ్యక్తిగా తరచు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చర్చల్లో కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో ముద్దిరెడ్డికి పోటీ చేసే అవకాశం దొరకకుండా చేయాలనే ప్రయత్నాలు కూడా ఉన్నట్లు స్వయంగా ఆయనే చెప్తున్నారు.

ప్రత్యర్ధుల కుట్ర: ముత్తిరెడ్డి

ఇవన్నీ ఒక ఎత్తైతే, తనపై వచ్చిన ఈ ఆరోపణలు, విమర్శలు వెనక ప్రత్యర్ధుల కుట్ర ఉందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెబుతున్నారు. ఎవరెన్ని చెప్పినా అధినేత కేసిఆర్ అండ ఉందంటూ, తానేంటో జనగామ ప్రజలకు తెలుసు అంటూ తనదైన శైలిలో సమాధానం చెబుతున్నారు. స్వయంగా కలెక్టరే భూకబ్జా ఆరోపణలు చేసిన అది నిజం కాలేదన్నారు. ప్రజలు నమ్మలేదని చెప్పారు.

సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారని, గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసినా వాళ్ళ ఆటలు సాగలేదని వివరించారు. తన బిడ్డను ఒక పావుగా ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లకు కూడా పిల్లలు ఉన్నారు. వాళ్లకు కూడా సంసారాలు ఉన్నాయి. నన్ను బదనాం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ముత్తిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.