హైద్రాబాద్ కు చేరుకున్న చంద్రబాబు.. తెలంగాణ పార్టీల్లో టెన్షన్

- కాంగ్రెస్ ను గెలిపించే ప్లాన్ చేస్తున్నారంటూ ఈటల ఆరోపణ
విధాత : స్కిల్ స్కామ్ కేసులో 53రోజుల పాటు రాజమండ్రి జైలు లో ఉండి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం ఎన్.చంద్రబాబునాయుడు బుధవారం జూబ్లిహీల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఆయన హైద్రాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటారు. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో చంద్రబాబు ఏపీలోని ఉండవల్లి నివాసంలో ఉండకుండా హైద్రాబాద్‌లోని తన నివాసానికి చేరుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది.
అయితే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మేలు చేసే ఉద్దేశంతోనే టీడీపీ పోటీ నుంచి తప్పుకుందని బీఆరెస్, బీజేపీలు భావిస్తున్నాయి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా చంద్రబాబుపై పలు సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెడుతున్నాడని, కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆరోపించారు. బాబు జైలు నుంచి విడుదలైన తర్వాత కాంగ్రెస్‌ను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారని ఈటెల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెర ముందు ప్రచారం చేసిన చంద్రబాబు 2023లో కాంగ్రెస్ గెలుపుకు తెరవెనుక ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆరోపించారు. ఇదే ఆరోపణలతో ఆయన ట్వీట్టర్ ఎక్స్‌లో ట్వీట్ కూడా చేశారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో గన్నవరం ఏయిర్ పోర్టు నుంచి హైద్రాబాద్ చేరుకున్న చంద్రబాబుకు బేగంపేట విమానాశ్రయం వద్ధ టీడీపీ శ్రేణులు, అభిమానులు, ఐటీ ఉద్యోగులు భారీ ఎత్తున ఘన స్వాగతం పలుకడం విశేషం. కోర్టు షరతుల నేపధ్యంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడకుండా అభిమానులకు కారు నుంచే అభివాదం చేస్తూ జూబ్లిహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.