విధాత, హైదరాబాద్: దేశంలో మహిళా సాధికారిత సాధనకే కాంగ్రస్ నారీ సమ్మేళనం న్యాయ్ యాత్ర చేపట్టామని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె విలేఖరులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆరెస్‌లు మహిళల పట్ల వివక్షతను, అణిచివేత విధానాలను అమలు చేశాయన్నారు. మహిళలపై దారుణాలు, కిడ్నాప్‌లు ఆ రెండు పార్టీల పాలనలోనే అధికంగా జరిగాయన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పిందన్నారు. కేంద్రంలోని బీజేపీ మహిళలపై వివక్ష చూపిస్తోందని విమర్శించారు. రాజకీయ, విద్యా వ్యవస్థలో మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు. రాహుల్ గాందీ ప్రధాని అయితే మహిళలకు 51 శాతం రిజర్వేషన్ కల్పిస్తారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మహిళల సంక్షేమాన్ని కాంక్షిస్తూ మహాలక్ష్మి పథకాన్ని తెచ్చిందన్నారు. ఇప్పటికే ఉచిత బస్ ప్రయాణం అమలు చేసిందని, 500 గ్యాస్ సిలిండర్, గృహలక్ష్మి 200యూనిట్ల ఉచిత విద్యుత్తు, 2,500ఆర్ధిక సహాయం పథకాలను అమలు చేబోతుందన్నారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు అధిక సంఖ్యలో కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తారన్నారు. కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ, బీఆరెస్ నేత కల్వకుంట్ల కవితలకు మహిళల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్ వసతి కల్పిస్తే మగవారికి సీట్‌లు దొరకడం లేదని బీఆరెస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడటం అనుచితంగా ఉందని సునీతా రావు విమర్శంచారు. అలాగే ఉల్లి ధరలు పెరిగాయని అడిగితే ఉల్లిపాయలు తినొద్దని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారన్నారు.
పదేళ్ల అవినీతిని ప్రజలముందుంచుతాం
గత బీఆరెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో సాగించిన అవినీతిని ప్రజల ముందు ఉంచుతామని సునీతారావు స్పష్టం చేశారు. తప్పు చేయకపోతే కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఎందుకు దొంగలా పారిపోతున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరంతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి, ధరణి ముసుగున సాగించిన భూ దోపీడి, సంక్షేమ పథకాల మాటున సాగించిన అవినీతి ఎటు చూసిన బీఆరెస్ పాలన అంతా అవినీతి మయంగా సాగిందన్నారు. హరీష్ రావు సీఎం అవ్వాలని రూ. 5 వేల కోట్లు వెనుక వేసుకున్నారని ఆరోపించారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాసంపదను కార్పోరేట్లకు దోచిపెడుతుందని, పేదలు, బలహీన వర్గాలను, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిని విస్మరించి మత రాజకీయాలు సాగిస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఉద్యోగాల కల్పన హామీ అమలులో విఫలమైందన్నారు. పార్లమెంట్‌లో బీజేపీ ప్రవేశ పెట్టిన ప్రతి బిల్లుకు బీఆరెస్‌కు మద్దతు పలికిన తీరే ఆ రెండు పార్టీలు ఒక్కటేననడానికి నిదర్శనమన్నారు.
రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడుతున్న బీఆరెస్ పార్లమెంటు ఎన్నికల్లో డబ్బు పంచి గెలుపొందాలని చూస్తోందని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తుందని, ఉద్యోగ భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తుందన్నారు. కేసీఆర్ తరహాలో నియంతృత్వ పాలన కాకుండా స్వేచ్చతో కూడిన ప్రజాపాలన అందిస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకోబోతుందన్నారు.