దయ్యం కన్ను గెలాక్సీ.. చూస్తే మతిపోవుడే!

అంతు చిక్కనిది ఆకాశం. ఆ ఆకాశంలోకి టెలిస్కోపులు పెట్టి చిత్రీకరించే దృశ్యాలు.. నివ్వెరపర్చేలా ఉంటాయి. కొన్ని నమ్మడానికి కూడా వీల్లేనట్టు కనిస్తుంటాయి

  • By: Somu    latest    Nov 29, 2023 10:30 AM IST
దయ్యం కన్ను గెలాక్సీ.. చూస్తే మతిపోవుడే!

విధాత‌: అంతు చిక్కనిది ఆకాశం. ఆ ఆకాశంలోకి టెలిస్కోపులు పెట్టి చిత్రీకరించే దృశ్యాలు.. నివ్వెరపర్చేలా ఉంటాయి. కొన్ని నమ్మడానికి కూడా వీల్లేనట్టు కనిస్తుంటాయి. అలాంటిదే ఒక అద్భుత దృశ్యాన్ని నాసా విడుదల చేసింది. భూమికి 17 మిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలోని నక్షత్ర మండలపు వేణీమండలంలో ఉన్న ఈ దృశ్యం.. అంతరిక్ష పరిశోధకులను ఆకర్షిస్తున్నది. హబుల్‌ టెలిస్కోప్‌ ద్వారా 2008లో చిత్రీకరించిన ఈ అపూర్వదృశ్యాన్ని నాసా తన ఇన్‌స్టా పేజీలో షేర్‌ చేసింది.


దీనికి ఈవిల్స్‌ ఐ (దయ్యం కన్ను) అని నామకరణం చేశారు. జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్న నాభిస్థానం చుట్టూ నీలి, ఊదారంగు చుక్కలతో అచ్చెరువొందిస్తున్నది. అధికారికంగా మెస్సయిర్‌ 64 (ఎం 64)గా పిలిచే పాలపుంత.. తన ఆకృతి విశేషం కారణంగా దయ్యం కన్నుగా పిలుస్తున్నారు. దీనిని 18వ శతాబ్దంలో ఫ్రెంచ్‌ అంతరిక్ష పరిశోధకుడు మెస్సయిర్‌ కనుగొన్నాడు.


ఆ కారణంగా దానికి ఆయన పేరు ఎం64గా నామకరణం చేశారు. మరో విశేషం ఏమిటంటే.. ఇందులో బాహ్య ప్రాంతాలు వ్యతిరేక దశలో, అంతర్‌ ప్రాంతాలు అందుకు భిన్న దిశలో తిరుగుతున్నాయని నాసా పేర్కొన్నది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం వేరొక గెలాక్సీని ఎం64 ఢీకొన్న కారణంగా ఈ పరిణామం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వెతికిన కొద్దీ ఇలాంటి అద్భుత దృశ్యాలు ఇంకెన్ని ఈ జగత్తు నిండా నిండి ఉన్నాయో.