రెండో రోజు కొనసాగుతున్న ఎన్డీఎస్‌ఏ విచారణ
ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నిపుణుల కమిటీ రెండో రోజు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజినీర్లతో సమావేశమైంది

విధాత, హైదరాబాద్: ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నిపుణుల కమిటీ రెండో రోజు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజినీర్లతో సమావేశమైంది. ఎర్రమంజిల్‌లోని జలసౌధలో చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బాధ్యులైన ఇంజినీర్లతో విడివిడిగా చర్చలు జరుపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ డిజైన్ల వివరాలను తెలుసుకుంది. మూడు ఆనకట్టల మోడల్స్‌ను పరిశీలించింది. వాటిని రూపొందించిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజినీర్లతో రెండో రోజు కూడా భేటీ కొనసాగించింది.
ఆనకట్టల నిర్వహణ బాధ్యతలు చూసే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం నుంచి కమిటీ సమగ్ర వివరాలు కోరింది. 2019లో సమస్యలు ఉత్పన్నమైనప్పటి నుంచి తీసుకున్న చర్యలు, చేపట్టిన తనిఖీల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణ పనులు చేసిన ఎల్‌ఆండ్‌టీ ప్రతినిధులతోనూ కమిటీ సభ్యులు భేటీ కావడం ఆసక్తికరం.