ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం: ఇప్పుడు పేరు మార్పు అవసరమా అద్దెచ్చా!

విధాత: ఏమిటో.. ఒక్కోసారి ఆంధ్రప్రదేశ్ పాలకుల తీరు విచిత్రంగా ఉంటుంది. ఒక్కోసారి ప్రత్యర్థి పార్టీలు నాయకులను అమితంగా గౌరవించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కోసారి అదే నాయకుడి గౌరవాన్ని, అనవాళ్లను చరిత్రలో లేకుండా చేరిపేసేందుకు ప్రయత్నిస్తారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరుతో మనుగడలో ఉన్న ఆరోగ్య విశ్వ విద్యాలయాన్ని ఇక ముందు వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చాలని ప్రభ్యత్వం భావిస్తోందన్న వార్త ఇప్పుడు చర్చకు దారి తీసింది. వాస్తవానికి దేశంలోనే మొట్టమొదటి వైద్య విశ్వవిద్యాలయం […]

  • By: krs    latest    Sep 21, 2022 4:39 AM IST
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం: ఇప్పుడు పేరు మార్పు అవసరమా అద్దెచ్చా!

విధాత: ఏమిటో.. ఒక్కోసారి ఆంధ్రప్రదేశ్ పాలకుల తీరు విచిత్రంగా ఉంటుంది. ఒక్కోసారి ప్రత్యర్థి పార్టీలు నాయకులను అమితంగా గౌరవించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కోసారి అదే నాయకుడి గౌరవాన్ని, అనవాళ్లను చరిత్రలో లేకుండా చేరిపేసేందుకు ప్రయత్నిస్తారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరుతో మనుగడలో ఉన్న ఆరోగ్య విశ్వ విద్యాలయాన్ని ఇక ముందు వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చాలని ప్రభ్యత్వం భావిస్తోందన్న వార్త ఇప్పుడు చర్చకు దారి తీసింది.

వాస్తవానికి దేశంలోనే మొట్టమొదటి వైద్య విశ్వవిద్యాలయం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం. 1986లో ఎన్టీఆర్ స్వయంగా దీన్ని విజయవాడలో ప్రారంభించారు. అంతవరకూ ఆరోగ్య విశ్వ విద్యాలయాలు ప్రత్యేకంగా ఉండేవి కాదు. మెడికల్ కాలేజీలు అన్నీ దగ్గర్లోని విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా పని చేసేవి.

అయితే ఎన్టీఆర్ ఇలా ప్రత్యేక వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాకే దేశంలో మిగతా రాష్ట్రాలు ఏపీ బాటలో నడిచి ప్రత్యేక హెల్త్ వర్సిటీలు ప్రారంభించి మెడికల్ కాలేజీల పర్యవేక్షణకు దానికి అప్పగించాయ్. ఆ తరువాత ఎన్టీఆర్ మరణించాక ఆ వర్సిటీకి ఆయన పేరును పెట్టడం జరిగింది. ఇన్నాళ్లుగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా ఉన్న విద్యాసంస్థ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీగా మార్పు చేస్తూ అసెంబ్లీలో సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

పేరు మార్పు విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేబినేట్ ఆమోదం కూడా తీసుకుంది. ఆన్‌లైన్‌లోనే దీనికి మంత్రివర్గం ఆమోదం తెలపడం గమనార్హం. ఈ సవరణ బిల్లును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శాసనసభలో ప్రవేశ పెట్టేందుకు అవకాశం ఉంది. వాస్తవానికి ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో అభిమానం.. గౌరవం ఉన్నాయని చెప్పుకునేందుకు జగన్ ఎన్నడూ సందేహించలేదు సరికదా ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.

అలాంటిది ఇప్పుడు ఆయన పేరిట ఉన్న యూనివర్సిటీ పేరును ఎందుకు మారుస్తున్నారో అర్థం కావడం లేదని అధికార, రాజకీయ వర్గాల్లో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా సుపరిచితం అయిన యూనివర్సిటీ పేరు మార్చడం అవివేకం అవుతుందని అంటున్నారు.

అంతగా కావాలనుకుంటే ఈ వైద్య విశ్వవిద్యాలయం పక్కనే రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన దంత వైద్య కళాశాల ఉంది. దానికి వైఎస్సార్ పేరు పెట్టుకుంటే సరిపోతుందని.. అలాంటిది. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటున్నారు.

చంద్రబాబు ఆగ్రహం

డాక్టర్‌ ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరును డాక్టర్‌ వైఎస్సార్‌ ఆ హెల్త్ యూనివ‌ర్సిటీగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాల్సిందే. పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ఇది తుగ్లక్‌ చర్య అని బాబు అన్నారు.

ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవం. ఉన్న సంస్థలకు పేర్లు మార్పు కాదు.. కొత్తగా నిర్మిస్తే పేరొస్తుంది. 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీతో వైఎస్సార్‌కు ఏం సంబంధం? ఎన్టీఆర్‌ నిర్మించిన వర్సిటీకి మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటావు? అని ప్ర‌శ్నించారు. వర్సిటీ నెలకొల్పింది.. అభివృద్ధి చేసింది ఎన్టీఆరే అని చంద్రబాబు పేర్కొన్నారు.