కూటమికి నితీశ్ కుమార్ వెన్నుపోటు!

రాజకీయంగా నమ్మదగిన వ్యక్తులు కాదు.. అని కొందరిపై అభిప్రాయాలు ఉంటాయి

కూటమికి నితీశ్ కుమార్ వెన్నుపోటు!

నిన్నటిదాకా బీజేపీని విమర్శించిన నితీశ్‌

బీజేపీపై పోరాటమంటూ బీరాలు పలికి..

వైరివర్గంలో చేరిపోయిన జేడీయూ అధినేత

బీహార్‌లో మహాఘట్‌బంధన్‌కు గుడ్‌బై

బీజేపీ మద్దతుతో మళ్లీ సీఎంగా నితీశ్‌ 

నితీశ్‌తోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు

మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం

న్యూఢిల్లీ : రాజకీయంగా నమ్మదగిన వ్యక్తులు కాదు.. అని కొందరిపై అభిప్రాయాలు ఉంటాయి. అటువంటి అభిప్రాయాన్ని బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ మరోసారి రుజువు చేశారు. తనకు పదవులే తప్ప.. రాజకీయ విలువల్లేవని మరోమారు చాటుకున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే వాదనకు గట్టి నిదర్శనంగా నిలిచారు. గత కొద్దిరోజులుగా బీహార్‌లో జరుగుతున్న పరిణమాలు ఆదివారం తీసుకున్న కీలక మలుపులో.. బీహార్‌లో మహాకూటమికి, జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి నితీశ్‌ రాజకీయంగా వెన్నుపోటు పొడిచారు. మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తానంటూ బీరాలు పలికిన నితీశ్‌.. అస్త్ర సన్యాసం చేసి.. వైరివర్గంలో చేరిపోయారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, సాయంత్రానికే మళ్లీ బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. అయితే.. బీజేపీ-జేడీయూ చెలిమి ఎంతోకాలం మనలేదని, రాబోయే 2025 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలోపే మళ్లీ మార్పు ఉంటుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యానించడం విశేషం. ఎందుకంటే.. నితీశ్‌ గత రాజకీయ చరిత్ర మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా కొన్నాళ్లు, అనుకూలంగా కొన్నాళ్లు అన్నట్టు సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఎన్డీయే కూటమిలోకి వెళ్లారు. మహాఘట్‌బంధన్‌లో వ్యవహారాలు సరిగా లేకపోవడమే తాను కూటమి నుంచి వైదొలగడానికి కారణమని నితీశ్‌ చెబుతున్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు విన్న తర్వాతే తానీ నిర్ణయం తీసుకున్నానని గవర్నర్‌కు రాజీనామా పత్రం అందించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

బీహార్‌కు తొమ్మిదోసారి సీఎంగా నితీశ్‌

బీజేపీ మద్దతుతో బీహార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేశారు. ఆయన తొమ్మిదోసారి ముఖ్యమంత్రి కావడం ఒక విశేషమైతే.. ఏడాది వ్యవధిలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం మరో విశేషం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జీతన్‌ రామ్‌ మాంఝీ, చిరాగ్‌ పాశ్వాన్‌, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నితీశ్‌ ప్రమాణం చేసిన సమయంలో అక్కడివారంతా భారత్‌ మాతా కీ జై, జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. నితీశ్‌తోపాటు బీజేపీకి చెందిన సమ్రాట్‌ చౌదరి, విజయ్‌ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా, మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. అంతకు ముందు ఉదయం 10.15 గంటలకు నితీశ్‌ కుమార్‌ ఇంట్లో జేడీయూ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు విడిగా వీర్‌చాంద్‌ పటేల్‌ మార్గ్‌లోని బీజేపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ రాజీనామా సమర్పించేందుకు రాజ్‌భవన్‌కు రానున్నారన్న వార్తలతో అక్కడ భద్రతను పటిష్టం చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన నితీశ్‌ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌కు అందించారు. దానితోపాటు తనకు బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదంటూ తగిన పత్రాలు అందించారు. ఆ వెంటనే నితీశ్‌కు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌ చేసి అభినందించారు. రాజీనామా సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన నితీశ్‌కుమార్‌.. సంకీర్ణ కూటమిలో మునుపెన్నడూ లేని పరిస్థితులను పరిశీలించిన తర్వాతే కూటమి నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ‘సంకీర్ణంలో పరిస్థితులు సానుకూలంగా లేవు. పార్టీ నేతలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నేను నా రాజీనామా సమర్పించాను’ అని తెలిపారు. మరోవైపు మధ్యాహ్నం బీజేపీ ఎమ్మెల్యేలు జేడీయూతో సంయుక్త సమావేశం కోసం నితీశ్‌ నివాసానికి వెళ్లారు. అక్కడ ఎన్డీయే పక్ష నాయకుడిగా నితీశ్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అనంతరం ఆయన గవర్నర్‌ వద్దకు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరారు.

2022లో ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్న జేడీయూ.. ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిసి మహాకూటమిగా ఏర్పడింది. ఈ రెండేళ్ల వ్యవధిలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలను ఐక్యం చేసి, ఇండియా కూటమి ఏర్పాటుకు కృషి చేశారు. ఇండియా కూటమిగా పేరు పెట్టడానికి ముందు బీహార్‌లో నిర్వహించిన తొలి సమావేశానికి ఆయన ఆతిథ్యం ఇచ్చారు.  

నమ్మకద్రోహాల్లో నితీశ్‌ రికార్డ్‌ : అఖిలేశ్‌యాదవ్‌

నమ్మక ద్రోహాల్లో నితీశ్‌కుమార్‌ రికార్డు సృష్టించారని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ఈ పరిణామంతో బీజేపీ మరింత బలహీనపడిందని వ్యాఖ్యానించారు. నితీశ్‌కుమార్‌ 2000 సంవత్సరంలో తొలిసారి బీహార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఆర్జేడీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. 2013లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసి ఆర్జేడీతో కలిసి 2015 ఎన్నికల్లో పోటీ చేశారు. 2017లో ఆర్జేడీతో సంబంధాలు తెంచుకుని మళ్లీ ఎన్డీయే గూటికి చేరారు. 2022లో మళ్లీ ఎన్డీయేకు గుడ్‌బై చెప్పి ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆర్జేడీని వదిలేసి, ఎన్డీయే తీర్థం పుచ్చుకున్నారు.