రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్.. అధికారిక ప్రకటన ముందే లీకుల కలకలం..

విధాత: రసాయన శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ (Nobel) పురస్కారం అమెరికాకు చెందిన మౌంగీ బవెండి, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్‌లను వరించింది. అయితే ఎకిమోవ్ రష్యన్ అని కొన్ని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ మంగళవారం వెల్లడించింది. అయితే అధికారిక ప్రకటన వెలువడక ముందే అవార్డు వీరికే వస్తుందంటూ వదంతులు రావడం కలకలం రేపింది.
సాధారణంగా అధికారిక ప్రకటన వచ్చే వరకు నోబెల విజేతల పేర్లు అత్యంత గోప్యంగా ఉంటాయి. లీక్ కావడం సంచలనం కలిగిస్తోంది. రసాయన విభాగంలో 2023 సంవత్సరానికి గానూ ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలు, ఒక రష్యన్ శాస్త్రవేత్త నోబెల్‌కు ఎంపికయ్యారని వారి పేర్లతో సహా సమాచారం లీకైంది. స్వీడిష్ దినపత్రిక అయిన ఆఫ్టాన్‌బ్లాడెట్‌కు నోబెల్ ఎంపిక కమిటీ పేరుతో ఒక మెయిల్ వచ్చింది.
అందులో మోంగీ బావెండీ, లూయిస్ ఈ బ్రస్, అలెక్సీ ఎకిమోవ్‌లకు రసాయన శాస్త్రంలో నోబెల్ ఇస్తున్నట్లు తెలిపింది. క్వాంటమ్ డాట్ టెక్నాలజీపై వారు చేసిన పరిశోధనలకు గానూ అవార్డు లభించిందని సైతం ఆ మెయిల్‌లో ప్రస్తావించారు. ఈ ఏడాది నోబెల్ అవార్డును క్వాంటమ్ డాట్, నానో పార్టికల్స్ స్వభావాలను పరిశోధనలకు ఇవ్వనున్నాము అని పేర్కొన్నారు.
అయితే ఈ వార్తలను రాయల్ స్వీడిష్ అకాడమీ ఖండించింది. అవార్డులకు ఎంపిక ఇంకా పూర్తికాలేదని స్పష్టం చేసింది. మరోవైపు రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డులను ప్రకటించే కమిటీ ఛైర్మన్ జోహాన్ ఆక్విస్ట్ దీనిని రాయల్ సైన్స్ అకాడమీ పొరపాటుగా పేర్కొన్నారు. తాము ఉదయం 9:30 గంటలకు సమావేశం అయ్యామే కానీ విజేతలను నిర్ణయించలేదన్నారు. ఆఖరికి లీక్ అయిన జాబితాలో ఉన్న పేర్లే అధికారిక ప్రకటనలోనూ వెలువడటం గమనార్హం.