రెచ్చగొడితే అణు దాడి తప్పదన్న ఉత్తరకొరియా దేశాధినేత కిమ్
ఉత్తర కొరియాపై అణుదాడి చేస్తామని ఎవరైనా మమ్ముల బెదిరిస్తే, రెచ్చగొడితే తాము కూడా అణుబాంబు ప్రయోగానికి వెనకాడబోమని ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు

ప్యాంగ్యాంగ్ : ఉత్తర కొరియాపై అణు దాడి చేస్తామని ఎవరైనా మమ్ముల బెదిరిస్తే, రెచ్చగొడితే తాము కూడా అణుబాంబు ప్రయోగానికి వెనకాడబోమని ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. మిస్సైల్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం మాక్ డ్రిల్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా సైనికులతో నిర్వహించిన కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అణుదాడి హెచ్చరికలు చేశారని ఉత్తరకొరియా వార్తా సంస్థ పేర్కొన్నది. ప్రత్యర్ధులు అణుబాంబులతో రెచ్చగొడితే ఏ మాత్రం సంకోచించ కుండా అణుబాంబు ప్రయోగించాలని మిస్సైల్ బ్యూరోకు కిమ్ జోంగ్ ఉన్ సూచించినట్టు తెలిపింది. తాజాగా కిమ్‌ను చర్చల్లో బేషరతుగా పాల్గొనాలంటూ దక్షిణకొరియా, దాని మిత్ర దేశం అమెరికా కోరిన నేపథ్యంలో ఆయన హెచ్చరికలకు ప్రాధాన్యం సంతరించుకున్నాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా వుంటే గతవారం వాషింగ్టన్ డీసీలో అమెరికా, దక్షిణ కొరియా మధ్య కీలక సమావేశం జరిగింది. ఉత్తర కొరియాతో యుద్ధం తలెత్తిన పక్షంలో అణు బాంబు ప్రయోగ నివారణకు ఏం చేయాలనే దానిపై ఈ మీటింగ్‌లో ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ఉత్తరకొరియా తమపై అణుబాంబు ప్రయోగిస్తే కిమ్ పాలన అంతమైపోతుందని ఉభయ దేశాలు ఈ భేటీ తర్వాత ఘాటు విమర్శలు చేశాయి. ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా శాంతి చర్చల్లో కిమ్ పాల్గొనాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు హెచ్చరికలు చేయడం గమనార్హం.