Konda Murali| తగ్గెదేలే..కొండా మురళీ..పరకాల అభ్యర్థిని నేనే అన్న కూతురు సుస్మిత

Konda Murali| తగ్గెదేలే..కొండా మురళీ..పరకాల అభ్యర్థిని నేనే అన్న కూతురు సుస్మిత

విధాత: ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలలో మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఎపిసోడ్ తో జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంగా సాగుతున్నాయి. కొండా సురేఖ మురళి దంపతులకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంగా ఏకమైనప్పటికి..తాను తగ్గేదేలేదంటూ మరోసారి మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్యవైశ్య సంఘం సమావేశంలో మాట్లాడిన కొండా మురళి నాతో ప్రజలకు ఏనాడు ఇబ్బంది లేదన్నారు. నేను ఎవరినీ ఇబ్బందిపెట్టలేదని..ఎవరికీ భయపడనని తెలిపారు. ఐదుసార్లు సురేఖను ఎమ్మెల్యేగా చేశానని..ఎమ్మెల్సీగా నేను ఏకగ్రీవంగా ఎన్నికయ్యానన్నారు. నా రాజకీయ జీవితంలో ఉన్నతవర్గాలతోనే పోటీ కొనసాగుతుందన్నారు. వాసవి కన్యకాపరమేశ్వరీ సాక్షిగా చెబుతున్నా..మానాన్న వత్తమ్ దారు..నాకు ఇంకా 500ఎకరాలు ఉందని..మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 16ఎకరాలు అమ్మి రూ.70కోట్లు ఖర్చు పెట్టానని..నాకు జనం దగ్గర నుంచి ఒక్క పైసా అవసరం లేదన్నారు.

ఇది ఇలా ఉండగానే కొండా మురళి కూతురు సుస్మిత ‘నేను ఎమ్మెల్యే అభ్యర్థి’ అంటు ఎంట్రీ ఇవ్వడం జిల్లా రాజకీయాల్లో మరింత రచ్చ రేపింది. పరకాల టికెట్‌ని ఆశిస్తున్నానంటూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో సుస్మితా అప్డేట్ ఇచ్చింది. దీంతో కొండా ఫ్యామిలీ నుంచి రాజకీయ వారసురాలి ఎంట్రీ ఖాయమని తేలిపోయింది.

ఇప్పటికే కొండా మురళి, వ్యతిరేక వర్గం పరస్పరం కాంగ్రెస్ రాష్ట్ర, కేంద్ర నాయకత్వానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం..పోటాపోటీ సమావేశాలు పెట్టడం జరిగింది. ఒకరిపై ఒకరు రాజకీయ అధిపత్య పోరులో పైచేయి కోసం వరుసగా పోటీ సమావేశాలలో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. తాజాగా కొండా మురళి వ్యాఖ్యలతో జిల్లా కాంగ్రెస్ వర్గపోరు మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తుంది.