రహస్యంగా గదిలో పామును వదిలేసి.. భార్యాబిడ్డను చంపేశాడు..
ఓ వ్యక్తి తన భార్య, బిడ్డను చాలా తెలివిగా చంపేశాడు. వారు నిద్రిస్తున్న గదిలోకి రహస్యంగా పామును వదిలాడు. అనంతరం భార్య, కూతుర్ని పాము కాటేయడంతో, వారిద్దరూ చనిపోయారు.

భువనేశ్వర్ : ఓ వ్యక్తి తన భార్య, బిడ్డను చాలా తెలివిగా చంపేశాడు. వారు నిద్రిస్తున్న గదిలోకి రహస్యంగా పామును వదిలాడు. అనంతరం భార్య, కూతుర్ని పాము కాటేయడంతో, వారిద్దరూ చనిపోయారు. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా కబి సూర్యనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన అక్టోబర్ నెలలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. అధీగావ్ గ్రామానికి చెందిన గణేశ్ పాత్రా(25), బసంతి పాత్రా (23) అనే యువతిని 2020లో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు రెండేండ్ల కూతురు ఉంది. అయితే గణేశ్ తన భార్య బసంతితో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆమె హత్యకు ప్రణాళిక రచించాడు. ఎవరికీ అనుమానం రావొద్దని చాలా తెలివిగా ఆలోచించాడు.
పాములు పట్టే వ్యక్తిని సంప్రదించి, ఓ విషపూరిత పామును తీసుకున్నాడు. పాములు పట్టే వ్యక్తి సూచన మేరకు దాన్ని ఒక సంచిలో బంధించి, భార్య, బిడ్డ నిద్రించే గదిలో వదిలేశాడు. ఇక నిద్రిస్తున్న భార్య, బిడ్డను ఆ పాము అక్టోబర్ 6వ తేదీ రాత్రి కాటేసింది. ఈ సమయంలో గణేశ్ వేరే గదిలో నిద్రించాడు. మరుసటి రోజు తెల్లారేసరికి వారిద్దరూ చనిపోయారు.
కూతురు, మనుమరాలి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన బసంతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ అనంతరం నెలన్నర తర్వాత అసలు విషయం బయటపడింది. గణేశ్ ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు అతడిని విచారించారు. చివరకు వారి గదిలోకి తానే పామును వదిలినట్టు అంగీకరించాడు. అనంతరం అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.