మెదక్: ఎవరికి వారే.. సైన్స్ ఫెయిర్‌కు రాలే! దూరంగా.. అధికారులు, ప్రజాప్రతినిధులు
కానరాని జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు ప్రొటోకాల్ పాటించని డీఈవో కలెక్టర్, అధికారులు సైతం గైర్హాజరు.. విధాత: గ్రేడ్ పాఠశాల, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులు విజ్ఞాన, సాంకేతిక కార్యకలాపాలలో పాల్గొనేందుకు ప్రదర్శనలు దోహదం చేస్తాయి. విద్యార్థులు సంవత్సరమంతా నేర్చుకున్న పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి అవకాశం కల్పించే ఒక వేదిక ప్రదర్శన. ఇది విద్యార్థులలో ప్రేరణ కల్పిస్తుంది, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిని తెలుసుకునేందుకు ఓ అవకాశం లభిస్తుంది. విద్యార్థులు తాము చేసిన పనిని ఇతరులతో పంచుకోవడం వల్ల ఆ అంశాలపై […]

- కానరాని జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు
- ప్రొటోకాల్ పాటించని డీఈవో
- కలెక్టర్, అధికారులు సైతం గైర్హాజరు..
విధాత: గ్రేడ్ పాఠశాల, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులు విజ్ఞాన, సాంకేతిక కార్యకలాపాలలో పాల్గొనేందుకు ప్రదర్శనలు దోహదం చేస్తాయి. విద్యార్థులు సంవత్సరమంతా నేర్చుకున్న పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి అవకాశం కల్పించే ఒక వేదిక ప్రదర్శన. ఇది విద్యార్థులలో ప్రేరణ కల్పిస్తుంది, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిని తెలుసుకునేందుకు ఓ అవకాశం లభిస్తుంది.
విద్యార్థులు తాము చేసిన పనిని ఇతరులతో పంచుకోవడం వల్ల ఆ అంశాలపై అవగాహన పెరుగుతుంది. అనేక నమూనాల ప్రదర్శనను చూసిన విద్యార్థులకు తాము కూడా ఇలాంటి ప్రదర్శనలో భాగస్వాములు కావాలన్న భావన ఏర్పడుతుంది. ఇలాంటి వాటిని సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర,జిల్లా స్థాయిల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ప్రారంభిస్తూ ఉంటారు. కానీ ఈ సారి మెదక్ జిల్లాలో ఇందుకు విరుద్ధంగా జరిగింది.
ప్రొటోకాల్ లొల్లి..
మెదక్ జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు సైన్స్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు. జిల్లా స్థాయి ప్రదర్శన అంటే జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. అయితే మొదటి రోజు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు హాజరు కాలేదు. కారణం జిల్లా విద్యాధికారి కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మూడ్రోజుల పాటు సాగిన సైన్స్ ఫెయిర్‌కు మొదటి రోజు మాత్రమే స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్నిప్రారంభించారు తప్ప అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, క్రాంతి కిరణ్ సహితం హాజరు కాలేదు. జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ డుమ్మ కొట్టడం గమనార్హం.
విద్యాశాఖ అధికారి రమేష్ తీరు దానికితోడు ప్రొటోకాల్ పాటించక పోవడమే జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, క్రాంతి కిరణ్ హాజరు కాకపోవడానికి కారణమని చెబుతున్నారు. సభా అధ్యక్ష స్థానంలో డీఈవో ఉండాల్సి ఉండగా మెదక్ ఎమ్మెల్యే పద్మారెడ్డి పేరు చేర్చడంతో డీఈవో సైతం హాజరు కాలేదని తెలిసింది.
ప్రజాప్రతినిధులు అంత బిజీనా..
విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఏర్పాటు చేసే వేదికల్లో పాల్గొని, విద్యార్థులను ప్రొత్సహించేందుకు ప్రజా ప్రతినిధులు కనీసం ముందుకు రాకపోవడం శోచనీయం. జిల్లా ప్రదర్శనలో తమ నియోజకవర్గ స్థాయి విద్యార్థులు ఎలాంటి ప్రదర్శనలు చేస్తున్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉండడం విడ్డూరంగా ఉంది.
మన ఊరు- మనబడి ద్వారా పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రజా ప్రతినిధులు ఇలాంటి వేదికలకు డుమ్మా కొట్టడం పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. సైన్స్ ఫెయిర్ సందర్శించేంత సమయం లేకుండా ఎమ్మెల్యేలు గడుపుతున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థుల ప్రదర్శన అద్భుతం.. కానీ
ఉపాధ్యాయుల తీరును పరిశీలించి వారికి సూచనలు, సలహాలు చేస్తూ విద్యాభివృద్ధికి తోడ్పాల్సిందిపోయి అంతా మా ఇష్టం అన్నట్లు జిల్లా విద్యాశాఖ వ్యవహరించడం పలు విమర్శలకు దారి తీసింది. జిల్లా వేదికగా మెదక్‌లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో విద్యార్థుల ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నా జిల్లా విద్యాశాఖ అధికారుల తీరుతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మాత్రమే..
సైన్స్ ఫెయిర్ మొదటి రోజు మెదక్ ఎమ్మెల్యే పద్మారెడ్డి ప్రారంభించగా, ముగింపు రోజు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి హాజరయ్యారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ వేదికకు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మాత్రమే హాజరవడం ప్రజా ప్రతినిధులు, అధికారుల మధ్య ఉన్న సమన్వయ లోపం చెప్పకనే చెప్తున్నట్టు ఉంది.
జిల్లా అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
సైన్స్ ఫెయిర్ కు హాజరై విద్యార్థులను చైతన్యం చేయాల్సిన బాధ్యత కలెక్టర్ ఎంతైనా ఉంది. కానీ ఇక్కడ ఎవరి ఇష్టానుసారంగా వారు వ్యవహరించడం పై ఎందుకు సైన్స్ ఫెయిర్ నిర్వహించారో తెలియని అయోమయం నెలకొంది. కలెక్టర్‌తో పాటు అధికారులు కూడా హాజరు కాకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సింది పోయి ఎవరికి నచ్చినట్లు వారు వ్యవహరించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రొటోకాల్ విషయమై విద్యాశాఖ అధికారి వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.