Electoral bonds । మద్యం కంపెనీలు కొన్న ఎలక్టోరల్ బాండ్ల విలువ చూస్తే కిక్కెక్కిపోద్ది!
ఎన్నికల సంఘం గురువారం రాత్రి విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో చిత్రవిచిత్రాలు బయటపడుతున్నాయి. దేశంలోని ప్రముఖ మద్యం తయారీ కంపెనీలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి

Electoral bonds । ఎన్నికల సంఘం గురువారం రాత్రి విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో చిత్రవిచిత్రాలు బయటపడుతున్నాయి. దేశంలోని ప్రముఖ మద్యం తయారీ కంపెనీలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకు 34.54 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను మద్యం తయారీ కంపెనీలు కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. ఇందులో రాడికో ఖైతాన్ లిమిటెడ్ (ఆర్‌కేఎల్) ఏప్రిల్ 20, 2019న ఐదు కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది.
ఆర్‌కేఎల్ భారతీయ తయారీ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్)కు సంబంధించిన దేశంలోనే అతి పురాతన, అతిపెద్ద కంపెనీ. గతంలో రాంపూర్ డిస్టిలరీగా ఉండేది. 1943లో దేశంలో తన ఉత్పత్తిని ప్రారంభించింది. కాలక్రమేణా దేశంలోని అతిపెద్ద ఐఎంఎఫ్‌ఎల్ కంపెనీగా ఎదిగింది. 8పీఎం విస్కీ, మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా, కాంటెస్సా ఎక్స్‌ఎక్స్‌ఎక్స్ రమ్, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ వంటి 15కుపైగా బ్రాండ్లను ఇది ఉత్పత్తి చేస్తున్నది.
సూలా వైన్‌యార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏప్రిల్ 20, 2019న 25 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. 1999లో మహారాష్ట్రలోని నాసిక్‌లో నెలకొల్పారు. ఇండియన్ వైన్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా అగ్రభాగాన ఉన్నది. ఒక విధంగా సూలా వైన్‌యార్డ్స్ ఆధారంగానే నాసిక్‌లో వైన్ ఇండస్ట్రీ ఎదిగింది. ఇక్కడే సూలా తన మొదటి వైన్ టెస్టింగ్ రూమ్‌ను ప్రారంభించింది. హిమాద్రి ఖాన్ కంట్రీ స్పిరిట్ బాట్లింగ్ ప్లాంట్ కమ్ వేర్‌హౌస్ 2021, జూలై 7న 70 లక్షల విలువ చేసే బాండ్లను కొనుగోలు చేసింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఈ కంపెనీ 17 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నది. ప్రధానంగా వైన్స్ తయారు చేస్తుంటుంది.
సోమ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ 2023 జూలై, అక్టోబర్ నెలల్లో మూడు కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఛత్తీస్‌గఢ్ డిస్టిలరీస్ లిమిటెడ్ 2019 ఏప్రిల్‌లో మూడు కోట్లు విలువ చేసే బాండ్లు కొన్నది. ప్రకాశ్ డిస్టిలరీస్ అండ్ కెమికల్ కంపెనీ 2.6 కోట్లు, మౌంట్ ఎవరెస్ట్ బ్రేవరీస్ లిమిటెడ్ 1.99 కోట్లు వెచ్చించి బాండ్లు కొన్నాయి. అసోసియేటెడ్ ఆల్కహాల్ అండ్ బ్రేవరీస్ 2023 అక్టోబర్ 10న 2 కోట్ల విలువైన బాండ్లు ఖరీదు చేసింది.
కాజిల్ లిక్కర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 75 విడుతలుగా 7.5 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. టీచర్స్ విస్కీ, ఆఫీసర్స్ చాయిస్ విస్కీ, కార్ల్స్‌బెర్గ్, టుబోర్గ్ బీర్ తదితరాలను ఇది మార్కెటింగ్ చేస్తున్నది. క్యాండి స్పిరిట్స్ కోటి, నార్తర్న్ స్పిరిట్స్ 1.2 కోట్లు, కేడీ లిక్కర్ అండ్ ఫర్టిలైజర్స్ 4 కోట్లు, మర్ది గ్రాస్‌కు చెందిన మర్ది గ్రాస్ లిక్కర్ డివిజన్ 2.3 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి.